సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 
న్యాయాలు-944
"కృపణేన సమో దాత" న్యాయము
*****
కృపణేన అంటే లోభికి, పిసినారికి, సమో అనగా సమానమైన. దాత అనగా దానము చేయువాడు.
 లోభితో సమానమైన దాత ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే వ్యంగార్థం ఇందులో ఉంది.
మరి ఈ వ్యంగార్థం మొత్తంగా కలిగిన శ్లోకం నరసింహ శతకంలో ఉంది చూద్దామా!
"కృపణేన సమో దాతా న భూతో న భవిష్యతి!!,అస్పృశ్యన్నేవ విత్తాని యః పరేభ్యః ప్రయచ్చతి!!
అనగా లోభితో సమానమైన దాత ఈ ప్రపంచంలోనే లేడట. అంతే కాదు అలాంటి వ్యక్తి గతంలో లేడట.భవిష్యత్తులో ఉండబోడట. ఎందుకంటే తాను సంపాదించిన దానిని కనీసం తన చేతులతో ముట్టుకోకుండానే పరులకు అనగా ఇతరులకు చేర వేస్తాడట. లోభిని ఘాటుగా విమర్శిస్తూ రాసిన శ్లోకం ఇది.
మన పెద్దవాళ్ళు తరచూ "రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు, పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి, ఎంగిలి చేత్తో కాకిని కొట్టని వ్యక్తి కడుపుకట్టుకుని సంపాదించిన సొమ్మంతా ఏనాటికైనా పరుల పాలే అవుతుందని అంటుంటారు.
తాను ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును లేదా ధనాన్ని తాను తృప్తి ఉపయోగించుకుని మంచి జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ, మిగిలింది ఇతరుల అవసరాలకు ఇవ్వవచ్చు. కానీ లోభి అలాంటి వాడు కాదు.తాను తినడు ఇతరులకు అంటే తన కుటుంబ సభ్యులకు ఎవరికీ పెట్టడానికి ఇష్టపడడు. తనకు మనసు ఒప్పకపోయినా కుటుంబ సభ్యులనైనా అవసరాలకు ఉపయోగించుకొమ్మని చెప్పవచ్చు కదా! అసలే లోభి అలాంటి మంచి పనులు ఎందుకు చేస్తాడు? లోభత్వం ఆ విధంగా "గడ్డివాము దగ్గర కుక్కవలె"ఉంటుంది. అది తన వాళ్ళను తిననీయదు, తాను తినదు.
 కట్టలతో తగలబెట్టేంత ఆస్తి ఉన్నా మాసిపోయిన బనీను, ముతక ప్యాంటు, చిరిగాన చొక్కానే ధరిస్తుంటారు ఇలాంటి వారిలో కొందరు.ధాన ధర్మాల ఊసే ఎత్తరు. కళ్ళారా చూసుకోకుండానే మరింత ఆశతో తాను సంపాదించిన దానిని తన చేతులతోనైనా ముట్టుకోకుండా ఇతరుల పాలు చేస్తారు. అనగా చివరికి జరిగేది ఏమిటంటే ఎప్పుడో ఒకప్పుడు ఇదంతా ఇతరుల పాలు అవుతుంది.అది తథ్యం అని అర్థం .
అందుకే ఈ న్యాయాన్ని వ్యంగార్థంతో చెబుతుంటారు. పక్కన ఎవరైనా ఆపదతో తల్లడిల్లి పోతున్నా పట్టించుకోడు. తనకు ఆకలి అయినా మంచి నీళ్ళు తాగో,మరింకేదో చేసి తనను తాను మభ్యపెట్టుకుని బతుకుతూ ఉంటాడు.
సుభాషిత కర్త ఎంత వ్యంగ్యంగా  అంటాడంటే అలాంటి వారు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా కనబడరనీ , శిబి చక్రవర్తి,బలి చక్రవర్తి,దదీచి,రంతి దేవుడు మొదలైన త్యాగ మూర్తులను వీరితో పోలిస్తే  లోభితో ఏ విధంగా కూడా ఇతడికి సరిసమానం కారని వ్యంగ్యంతో  అంటాడు.
ఇలాంటి వారిని చూసినప్పుడు మనకు కొన్ని పద్యాలు చటుక్కున గుర్తుకు వస్తాయి.'
  సుమతి శతక కర్త బద్దెన రాసిన పద్యాన్ని ఈ సందర్భంగా తప్పకుండా స్మరించుకోవాలి."
"చీమలు పెట్టిన పుట్టలు/ పాముల కిరవైన యట్లు, పామరుడు తగన్/ హేమంబు కూడబెట్టిన/ భూమీశుల పాలు జేరు భువిలో సుమతీ!
అనగా  చీమలు ఎంతో కష్టపడి కట్టుకున్న పుట్టను  పాములు ఆక్రమించినట్లు, లోభత్వంతో మూర్ఖంగా దాచిపెట్టిన  సొమ్ము చివరికి రాజులు లేదా ప్రభుత్వ పరం అవుతుంది అని అర్థం.
ఇంత వ్యంగ్యంగా చెప్పడానికి కారణం ఇలాంటివి, విని,చదివితే నైనా  అలాంటి వ్యక్తుల్లో కొంతైనా మార్పు వస్తుందేమోనని ఆశ మార్చాల్సిన బాధ్యత సాటి పౌరుడిగానో , స్నేహితుడు,బంధువుగానో ఉంది.
మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది "ఈ వ్యక్తి చచ్చిపోయేటప్పుడు సూది మొనంత అయినా  వెంట తీసుకుని పోలేడు కదా! ఎందుకిలా చేస్తున్నాడు. తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను,తన పిల్లలతో కలిసి అవసరమైనంత వరకు హాయిగా ఉపయోగించుకుని, మిగిలిన సొమ్ముతో  ఇతరులకు  అవసరమైనప్పుడు సాయం చేయొచ్చు కదా అనే నిగూఢమైన అర్థం ఇందులో యిమిడి ఉంది.
 ఈ "కృపణేన సమో దాతా " న్యాయము ద్వారా" లోభత్వం తగదని  అలా ఉండకూడదని-అనగా ఎలా ఉండాలో,ఉండకూడదో తెలుసుకున్నాం.ఎలా బతకాలో కూడా అర్థం చేసుకున్నాం.

కామెంట్‌లు