అమ్మ భాష..? ఆంగ్ల భాష..?:- కవి రత్న -సాహిత్యధీర -సహస్రకవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్

మన తెలుగు భాషంటే..?
దేశ భాషలందు తెలుగు లెస్సరా..!
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ రా...!
తల్లి ఒడిలో పెరిగిన ముద్దుబిడ్డరా..!
హృదయ తంతుల్ని తాకే గానంరా..!

ఏ దేశమేగినా...ఎందుకాలిడినా
పొగడరా తేనెలూరే నీ తెలుగుభాషను..!
కాపాడరా వెలుగునిచ్చే నీ తెలుగుజాతిని
అది నీ గౌరవ ఘంటారావమురా..!
అది నీ అంతరాత్మకు ఆభరణమురా..!

మన తెలుగు భాషంటే..?
అది జుంటి తేనియల కన్న 
తియ్యనిదిరా...
అది బంగినపల్లి మామిడి
పళ్ళకన్న మధురమైనదిరా...
అది కన్నతల్లి పాల కన్న 
పుష్టికరమైనదిరా...
అది హైదరాబాద్ బిర్యానీ కన్న 
అతి రుచికరమైనది..!

మన తెలుగు భాషంటే..?
అది మల్లెపూల కన్నా 
తెల్లని వెలుగురా...
అది మంచును మించిన 
చల్లని చల్లగాలిరా...
అది చందమామ కన్నా 
అందమైన చిరునవ్వురా..!

మన తెలుగు భాషంటే..?
అది వెలిగే కోహినూర్ వజ్రంరా
అది 56 అక్షరాల తేనెతుట్టెరా...
అది లక్షలపదాల ఆయుధాల నిధిరా.!

మన తెలుగు భాషంటే..?
తేటతేట వెలుగులు విరజిమ్మేదిరా 
ఏరులా, సెలయేరులా గలగలా పారేదిరా
గంగా గోదారిలా ప్రవహించే జీవనదిరా..!

పాడితే నా తెలుగు పాట...
మనసును పరవశింపజేసే
మధురగానం కావాలిరా...
"నాటు నాటు" పాటలా 
ప్రపంచమంతా 
ప్రతిధ్వనించే స్వరమవ్వాలిరా..!

వృక్షో రక్షతి రక్షితః...
ధర్మో రక్షతి రక్షితః అన్నారురా...
నీ తెలుగే నీకు రక్షణ, గౌరవంరా
నీకు ఖండాంతర ఖ్యాతి నిచ్చే
ఓ నిత్యనిధియే నీ తెలుగు భాషరా..!

అందుకే వద్దురా... వద్దురా...
ఆంగ్లభాష వ్యామోహపు 
మాయజాలం వద్దురా..!
వద్దురా...వద్దురా...
కమ్మనైన మీ అమ్మ భాషను 
చిన్నచూపు చూడొద్దురా..!


కామెంట్‌లు