సుప్రభాత కవిత : - బృంద
మనసులో ఎన్నో సునామీలు 
రెప్ప దాటని కన్నీటి సముద్రాలు 
గొంతులో లెక్కలేనన్ని సందేహాలు
పెదవి దాటని ప్రశ్నలు

కాలం విసిరే వలలో 
ఇరుక్కున్న జీవితాలు 
జాలమే తెలియని బుద్ధికి 
మూలం తెలుసుకునే వీలా?

గాయం సలుపును భరిస్తూ
మరుపు మందుకై ఎదురుచూస్తూ..
మధనం జరిగిన తర్వాత
మిగిలిన సహనం పోగు చేస్తూ...

నిశ్శబ్ద యుద్ధంలో 
నిరాశను ఓడించే 
నీరస యత్నానికి
నిముషాలు జోడిస్తూ....

ప్రహసనమైన  ప్రయత్నపు
ప్రయాసను పక్కకు తోసి
ప్రతివాదాన్ని కల్లచేయాలని
ప్రతి క్షణం పోరాటం...

ఎంత భరించలేక పోయినా 
బాధ కన్నా బ్రతుకే ఎక్కువ 
ఎన్ని కష్టాలు చుట్టూముట్టినా 
మనసుకన్నా మనుగడే ఎక్కువ..

చీకటి భయం వెలుగొచ్చేదాకా 
కలతల భయం ఎదుర్కొనేదాకా 
నేటి అసహనం రేపొచ్చేదాకా 
నిద్రమత్తు కిరణపు సెగతగిలేదాకా...

వేచి చూద్దాం వచ్చే వేకువ మనదేగా 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు