కుక్క కాపలా :----డా.పోతగాని సత్యనారాయణ
 ఒక పల్లెటూరిలో రైతుకు ఒక ఎద్దు, ఒక బద్ధకస్తురాలైన కుక్క ఉండేవి. కుక్క యజమానికి నమ్మకంగా నటిస్తూ స్వార్థపరురాలిగా ఉండేది. ఒక వేసవి మధ్యాహ్నం, రైతు పొలం నుండి ఎద్దుల కోసం తాజా గడ్డి తెచ్చి ఇంటి పక్కన వేశాడు. సాయంత్రం, ఆకలితో ఇంటికి వచ్చిన ఎద్దు గడ్డి తినడానికి కదిలింది. అక్కడే గడ్డిపక్కన పడుకున్న కుక్క వెంటనే లేచి, తన పదునైన పళ్ళు చూపిస్తూ, 
"ఈ గడ్డి నాది! ముట్టుకుంటే ప్రాణాలు తీస్తా!" అని మొరిగింది. ఆశ్చర్యపోయిన ఎద్దు, "నువ్వు గడ్డి తినలేవు కదా? నేను ఆకలితో ఉన్నాను, దయచేసి తిననివ్వు," అని బ్రతిమలాడింది. కానీ కుక్క మొండిగా 
"లేదు! నిన్ను తిననివ్వను! నేను తినకపోయినా సరే, దీన్ని ఎవరినీ ముట్టుకొనివ్వను!" అని అహంకారంగా అంది. 
పాపం ఎద్దు ఆ రాత్రంతా ఆకలితోనే గడ్డిపక్కన నిలబడింది. కుక్క తినకపోయినా, ఎద్దును మాత్రం తినకుండా కాపలా కాసింది. తెల్లవారుజామున రైతు, ఆకలితో ఉన్న ఎద్దును, పక్కన కాపలా కాస్తున్న కుక్కను చూసి జరిగిన విషయాన్ని, కుక్క ప్రవర్తనను అర్థం చేసుకున్నాడు.  రైతుకు దాని స్వార్థం తెలిసివచ్చింది. 
"నువ్వు పరాన్నభుక్కువి! నా నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నావు!" అని కోపంగా మందలించి, వెంటనే కుక్కకు తగిన శాస్తి చేశాడు. అప్పటినుండి 'గడ్డి కుప్ప దగ్గర కుక్క కాపలా' అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.
ఈ దండనతో కుక్కకు తన తప్పు తెలిసివచ్చింది. బద్దకాన్ని, స్వార్థాన్ని వదిలేసింది. అప్పటినుండి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ప్రారంభించింది. జంతువులకు సహాయపడుతూ నిజమైన విశ్వసనీయతతో జీవించడం మొదలుపెట్టింది. రైతు కూడా దాని మార్పును చూసి సంతోషించాడు.

కామెంట్‌లు