బ్రహ్మకు వివాహ పత్రిక:- - యామిజాల జగదీశ్
 "దక్షిణ తిరుపతి" అని పిలిచే ఒప్పిలియప్పన్ ఆలయం 108 దివ్య దేశాలలో 13వది. ఈ ఆలయాన్ని ఆకాశ నగరం, తిరువిన్నగర్ అని కూడా పిలుస్తారు.
భక్తులు కోరుకునేది నెరవేర్చే స్వామివారు ఒప్పిలియప్పన్. మార్కండేయ మహర్షి తపస్సు కారణంగా, స్వామివారు, భూమాదేవి ఇక్కడ అవతరించి శాశ్వతంగా నివసించారు. కాబట్టే దీనిని 'మార్కండేయ క్షేత్రం' అని కూడా పిలుస్తారు.
భూమాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఒప్పిలియప్పన్, వివాహ పత్రాన్ని గరుడుడికి ఇచ్చి సత్య లోకానికి వెళ్లి బ్రహ్మకు ఇచ్చిరమ్మని పంపాడు. 
గరుడుడు సత్య లోకానికి వెళ్లి బ్రహ్మను కలిశాడు. మార్కండేయ క్షేత్రంలో స్వామివారు, భూమాదేవి వివాహం చేసుకోనున్నారంటూ వివాహ పత్రాన్ని ఇచ్చి, మీరు, ఇంద్రుడు, ఇతర దేవతలందరూ వచ్చి వివాహాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పాడు గరుడుడు.
అందుకు, బ్రహ్మ సంతోషించి, వినమ్రతతో కళ్యాణ పత్రికను అందుకున్నాడు. దేవతలందరికీ ఆ ఆహ్వాన పత్రికను చదివి వినిపించాడు.
దానిలోని వచనం ఇలా ఉంది:-
మంగళప్రదం... ఓ బ్రహ్మా! దేవతల నాయకుడా, నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉంటారని, ఉండాలని నేను ఆశిస్తున్నాను. భూమాదేవి భూమిపై తులసీ వనంలో మార్కండేయ ముని కుమార్తెగా జన్మించింది. ఆ ఋషి నన్ను తన అల్లుడిగా పొందాలని కఠోర తపస్సు చేశాడు. ఆ మేరకు, శ్రవణా నక్షత్రం రోజున భూమాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీరు, దేవతలందరితో కలిసి, తులసి వనానికి వచ్చి, వివాహం నిర్వహించాలి. నాలుగు మంచి మాటలు చెప్పాలి.
మంచిని రక్షించడానికి, చెడును అంతం చేయడానికి, నా భక్తులకు దీవెనలు ప్రసాదించడానికి నేను యుగాలుగా ఈ లోకంలో అవతరిస్తాను.
ఇట్లు
నీ ప్రియమైన స్వామి. తులసీ వనం. కుంభకోణం. తిరునాగేశ్వరం. శ్రీ ఒప్పిలియప్పన్.

కామెంట్‌లు