సునంద భాష్యం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-943
"వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం" న్యాయము
****
వ్యాయామాత్ అనగా వ్యాయామము వల్ల. లభతే అనగా లభిస్తుంది. పొందుతాడు.స్వాస్థ్యం అనగా ఆరోగ్యము అనే అర్థాలు ఉన్నాయి.
 వ్యాయామము వల్ల ఆరోగ్యము చేకూరుతుంది అని అర్థము.
 మరి ఎలాంటి వ్యాయామము వల్ల ఆరోగ్యము చేకూరుతుంది ? వ్యాయామానికి ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటి? ఆరోగ్యం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.,
న్యాయానికి సంబంధించిన పూర్తి శ్లోకాన్ని చూద్దాము.
 వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం,దీర్ఘాయుష్యం బలం సుఖం!/ ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం!!"
అనగా వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరుతుంది. అంతే కాకుండా దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగుతాయి.ఇక చివరికి చెప్పొచ్చేదేమిటంటే ఆరోగ్యమే మహా భాగ్యం. స్వాస్థ్యము సర్వార్థాలకు సాధనము.
 వ్యాయామము వల్ల ఆరోగ్యము కలుగుతుంది అన్నప్పుడు ఎలాంటి వ్యాయామము వల్ల ఆరోగ్యము కలుగుతుంది?ఏఏ లాభాలు కలుగుతాయి? అనేది తెలుసుకోవాలి.
 వ్యాయామము అనేది రెండు రకాలుగా ఉంటుంది.శారీరక. రెండవది మానసిక. ఇవి సమర్థవంతంగా , చైతన్య వంతంగా పనిచేయడానికి నిత్యం వ్యాయామం మరియు ప్రాణాయామం చేయాలి.
శారీరక వ్యాయామము  వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తసరఫరా జరిగి, చైతన్యవంతంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఇక మానసిక వ్యాయామం అంటే  ప్రాణాయామం.ఇందులో కపాల భాతి, సూర్యచంద్ర భేది లాంటి శ్వాసల వ్యాయామం వల్ల  మనసు కూడా ఆరోగ్యవంతంగా అవుతుంది.
 ఆరోగ్య విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం.మానసిక ఆరోగ్యం అని రెండు రకాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం పొందడానికి ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.రకరకాల భంగిమలలో  చేసే వ్యాయామం మరియు ఆసనాలు. వీటి వల్ల శారీరక ఆరోగ్యం చేకూరుతుంది.
ఇక మానసిక ఆరోగ్యానికి యోగా మరియు ధ్యానము చేయడం. ఇవి రెండూ చేయడం వలన శారీరక ఆరోగ్యముతో పాటు మానసిక ఆరోగ్యం కలుగుతుంది.
 శారీరక ఆరోగ్యం కోసం కేవలం వివిధ రకాల వ్యాయామాలు చేయడమొక్కటే కాదు. ఆహారం కూడా ముఖ్యమని గ్రహించాలి. "తిండి కలిగితే కండ కలదోయ్- కండ కలవాడేను మనిషోయ్" అన్నాడు గురజాడ అప్పారావు గారు. ఆ మాటలు సదా గుర్తుంచుకోవాలి.కల్తీలేని సమతులాహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనలోని తామస గుణాలు నశిస్తాయని మన పెద్దలు అంటుంటారు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
 తీసుకునే ఆహారంలో  పోషక విలువలు కూడా ఉండేలా చూసుకోవాలి.హిందూ మతములో ముఖ్యమైన స్థానం కలిగిన ఆయుర్వేదం చాలా గొప్పది.  చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం ఏయే ఆహారం శరీరానికి ఎలాంటి మేలు లేదా కీడు చేస్తుందో,ఈ ప్రకృతిలో  ఏమేం లభ్యమవుతున్నాయో ఎన్నో పరిశోధనలు,పరిశీలనలు, ప్రయోగాలు చేసి మరీ చెప్పింది.
వ్యాయామము కేవలం పెద్దవాళ్ళకో లేదా చిన్న వాళ్ళకో కాదు. అన్ని వయసుల వారికి వ్యాయామం అవసరం. తప్పకుండా చేయాలి.
"వ్యాయమాత్ లభతే స్వాస్థ్యం" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే శారీరక,మానసిక వ్యాయామం తప్పనిసరిగా ప్రతిరోజూ చేయాలి.  ఈ వ్యాయామం చేయడంతో దీర్ఘాయువు, బుద్ధి కుశలత పెరుగుతాయి.  శారీరకంగా మానసికంగా చేసే ఆరోగ్యం వల్ల  మనిషిలో ఒకలాంటి కాంతి పెరుగుతుంది.
 కాబట్టి రెండు రకాలైన వ్యాయామాలను నిత్యం చేస్తే ,నిశ్చల చైతన్య స్థితి, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. శారీరక మానసిక ఆరోగ్యం ఉన్న వారి వలన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అభివృద్ధి పథంలో నడుస్తుంది. చిన్నప్పటి నుండే పిల్లలకు వ్యాయామం యోగా మనవంతు బాధ్యతగా నేర్పించాలి. "ఆరోగ్యం మహా భాగ్యం.వ్యాయామం పరమ భాగ్యం" ఇదే ఇందులో యిమిడి వున్న అర్థం.అది మనం గ్రహిద్దాం.

కామెంట్‌లు