నాపిచ్చి నాది:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నాకు
పెద్దపేరు రావాలి
అఖండఖ్యాతి కావాలి
ప్రజలనోర్లలో నానాలి

నన్ను
వేదికలు ఎక్కించాలి
ఉపన్యాసాలు ఇప్పించాలి
ఇంద్రుడుచంద్రుడు అనాలి

నన్ను
పొగడ్తలతో ముంచాలి
బిరుదులిచ్చి పురస్కరించాలి
చప్పట్లుకొట్టి శ్లాఘించాలి

నాకు
సాదరస్వాగతాలు పలకాలి
సింహాసనంలాంటి పీటవెయ్యాలి
గండపెండేరాలు తొడగాలి

నాపై
పూలజల్లులు కురిపించాలి
కమ్మనికవితలు వ్రాయాలి
శ్రావ్యమైనపాటలు పాడాలి

నాపేరు
పత్రికల్లో ప్రచురించాలి
టీవీల్లో చూపించాలి
రేడియోల్లో మారుమ్రోగించాలి

నాకు
కాశ్మీరీశాలువాలు కప్పాలి
ప్రశంసాపత్రాలు అందించాలి
సన్మానసత్కారాలు చేయాలి

నన్ను
ఎవరెస్టు ఎక్కించాలి
ఆకాశానికి ఎత్తాలి
జాబిలిపై కూర్చోపెట్టాలి

నన్ను
అందరూ గుర్తించాలి
ఎల్లరూ అభిమానించాలి
సర్వులు తలకెత్తుకోవాలి

నన్ను ప్రపంచమేటి అనాలి
నాకు ఇలలో సాటిలేరనాలి
నావ్యవహారం ముదిరందనుకోవాలి
నేనెవరినీ తిట్టటంలేదనుకోవాలి నాపిచ్చినాదే అనుకోవాలి


కామెంట్‌లు