నిర్లక్ష్యం :---డా.పోతగాని సత్యనారాయణ
 వసంతవాడ గ్రామంలో సుబ్బయ్య, పుల్లయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సుబ్బయ్య నిర్లక్ష్యంగా ఉండేవాడు, పుల్లయ్య అతి జాగ్రత్తగా వ్యవహరించేవాడు.
ఒక రోజు సుబ్బయ్య ఇంటి పక్కన అగ్నిప్రమాదం జరిగింది. జనం మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తుంటే, సుబ్బయ్య మాత్రం,
"ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి" 
అంటూ దాన్ని పట్టించుకోకుండా పుల్లయ్య ఇంటికి వెళ్ళాడు.
పుల్లయ్య ఆశ్చర్యపోయి, 
"నీ ఇంటి పక్కన మంటలు చెలరేగుతుంటే ఇంత నిర్లక్ష్యంగా పొలానికి ఎలా వెళ్తున్నావు? మీ బజారులో మంటలు లేస్తే, నా ఇంటికి అంటుకుంటాయని నేను నా ఇంటిని తడుపుకుంటున్నాను" అన్నాడు.
సుబ్బయ్య నవ్వి, 
"అతి జాగ్రత్త పనికిరాదు. అందుకే నిన్ను అందరూ పిచ్చి పుల్లయ్య అంటుంటారు" అన్నాడు.
అంతలో సుబ్బయ్య కొడుకు నరేష్ పరుగెత్తుకుంటూ వచ్చి, 
"నాన్నా, మన ఇంటికి నిప్పంటుకుంది, తొందరగా రా" అని ఏడుస్తూ చెప్పాడు.
ఇల్లు కాలుతోందని తెలియగానే సుబ్బయ్య గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. పుల్లయ్యతో సహా ముగ్గురూ అక్కడికి చేరుకున్నారు. కాలిపోతున్న ఇంటిని చూసి సుబ్బయ్య బోరున విలపించాడు.
పుల్లయ్య సుబ్బయ్యను ఓదార్చుతూ, 
"నా అతి జాగ్రత్త వలన శ్రమ వృధా అయ్యింది గానీ, నీ నిర్లక్ష్యం వలన ఎంత అనర్థం జరిగిందో చూడు. ఇకనైనా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుందాం" అన్నాడు.

కామెంట్‌లు