మనం!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.
కొండను తవ్వి ఎలుకను పట్టలేము. 
అడవిని కాల్చి పులిని చంపలేం. 
నదిని ఖాళీ చేసి చేపను పట్టలేము. 

ఆకాశాన్ని వంచి నక్షత్రాలను తుంచలేం 
అక్షరాలను తొలగించి చరిత్రను సృష్టించలేం. 

రాలిన ప్రతి వాన చుక్క సముద్రం కాలేదు 
వీచినా ప్రతి గాలి వాయుగుండం గా మారలేదు. 

మేఘాల మధ్యనే ఉరుములు మెరుపులు పుడతాయి. 
అల్లుకున్న నీరు కిరణాల మధ్యనే ఇంద్రధనస్సు మెరుస్తుంది. 

మార్చుకున్న రంగుల్లో- రక్తం పచ్చదనం!
నీలిరంగుల్లో-సముద్రం ఆకాశం!!
ఉదయ సంధ్యలో -పసుపు పారాణి!!!
చీకటి రాత్రుల్లో-పండువెన్నెల- వెండి కాంతులు!!

నిశ్శబ్దపు గుండెలు- జలతారు జలపాతాలు!
నిశ్శబ్దపు చూపులు-లేలేత కిరణాలు!!
నిశ్శబ్దపు మాటలు-ఉదయపు మంచు ముత్యాలు.!!
నిశ్శబ్దపు దృశ్యం-గడ్డ కట్టిన హిమాలయాలు.!!

ఎండ కాస్తుంది 
చలి వేస్తుంది 
చినుకు రాలుతుంది. 
ఋతువులు మారుతాయి 
ఋతువులు మళ్లీమళ్లీ వస్తాయి.!!

పువ్వు పూస్తుంది 
కాయా కాస్తుంది 
చిగురు వేస్తుంది 
కొత్తగా విత్తనం మళ్లీ మొలకెత్తుతుంది!!?

అది అందం!
అది ఆనందం!!
మనం బ్రహ్మానందం.!!

డా ప్రతాప్ కౌటిళ్యా.

కామెంట్‌లు