ఓ ఈశ్వరా..! పరమేశ్వరా..! జగధీశ్వరా..!
ఓ అర్థనారీశ్వరా..! ఓ జగజ్జనకా..!
విన్నవించుకోనా చిన్నకోరిక...
ఇన్నాళ్లుగా నా హృదయ గర్భంలో
పసిపాపలా ఆడిన కోరిక...!
కఠిన శిలల్లాంటి మీ కఠోరతకు
బదులు...
చామంతి పూలలా పరిమళించే
కరుణా కటాక్షాలను ప్రసాదించుమా..!
మా మదిలో కరగని మంచుగడ్డల్లాంటి
అసూయా ద్వేషాలకు...
కక్షలకు...కార్పణ్యాలకు...
బదులు...
సూర్యోదయ కిరణాల్లాంటి
ఆప్యాయతా ఆత్మీయతలను నింపుమా..!
మాలో అగ్నిజ్వాలల్లా రగిలే
పగా ప్రతీకారాలకు బదులు...
పవిత్రమైన ప్రేమానురాగాలను...
గంగాజలాల్లా పొంగి పొరలనివ్వుమా..!
మమ్ము బంధించే
అష్టకష్టాల సంకెళ్లకు బదులు...
అష్టైశ్వర్యాల కనకమాలలతో...
ఆయురారోగ్యాల అమృతపుధారలతో...
మా జీవనాన్ని అలంకరించుమా..!
భరించలేని బాధలకు...
వేడుకలేని వ్యధలకు....
మాపై వర్షించే వ్యాధి మేఘాలకు...
బదులు...
ఆకాశాన మెరిసే తారక మాలలతో...
భోగ భాగ్యాల వర్ధమాన జ్యోత్స్నలతో
మా జీవన శుభరాత్రిని వెలిగించుమా..!
ఆగని కన్నీటి ప్రవాహాలకు బదులు...
ముత్యాల హారాల్లా మెరిసే
ఆనందభాష్పాల వరాల్ని అందించుమా..!
సమస్యల సుడిగుండాల్లో మునిగిపోవడానికి బదులు...
సంతోష సాగరాల్లో
మేలిముత్యాల్లా తేలియాడే
సుఖమయ జీవితాన్ని ప్రసాదించుమా..!
అడుగడుగునా ఎదురయ్యే
అవాంతరాల పర్వతాలకు బదులు...
ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదగే
ఘన గౌరవ కిరీటాన్ని అలంకరించుమా..!
అదఃపాతాల అగాధాల్లో
జారిపోవడానికి బదులు...
ఆకాశపు అంచులు తాకే
స్వప్నయానానికి స్వాగతం పలుకుమా..!
ఓ జగన్నాథా...! ఓ అర్థనారీశ్వరా...!
మా విన్నపాలన్నీ ఆశీస్సులుగా మార్చి
కోటివరాల...
కుంభవర్షాన్ని మాపై కురిపించుమా...!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి