అనుకున్నది సాధించిన చిన్నారి!:- - యామిజాల జగదీశ్
 అది 1910. లండన్ నగరం. ప్రతి ఉదయం వైట్‌చాపెల్‌లోని బేకరీ ముందు ఒక చిన్న అమ్మాయి వెళ్ళి నిల్చునేది.
ఆమెకు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. ఆమె జుత్తు గజిబిజిగా ఉండేది. ఆమె వేళ్లు ఎర్రగా కనిపించేవి. ఆమె వేసుకున్న దుస్తులు చూడగానే చెప్పేవి అవి చాలా పాతవని. ఆమె చేతుల్లో ఓ ఖాళీ గుడ్డ సంచి. ఆమె పేరు ఎలియనోర్ గ్రేవ్స్.
బేకరీలోని గాజు షో కేసులో మెరిసే తాజా రొట్టెలు, ఆవిరి పట్టే బన్నులు, జామ్ సీసాలు ఉండేవి. కానీ చిన్నారి ఎలియనోర్ దగ్గర కొనుక్కు తినడానికి డబ్బు లేదు.
ఐరిష్ కార్మికుడైన ఆ చిన్నారి తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. ఆమె తల్లి గంటల తరబడి బట్టలు ఉతికితేనే డబ్బులు. దీంతో వచ్చే ఆ నాలుగు డబ్బులతో కుటుంబాన్ని నడపేది. కానీ ఆ డబ్బులు ఏ మాత్రం సరిపోయేవి కావు. ఆమె కడుపులో ఆకలి కాదు - అది అవకాశం కోసం ఆకలి.ఆ ఉదయం, ఎలియనోర్ తనలో తాను ఇలా వాగ్దానం చేసుకుంది...
"ఏదో ఒక రోజు నేనూ చదువుతాను. ఏ చిన్నారీ నాలాగా ఆకలి బాధ మళ్ళీ అనుభవించకూడదు."
ఆమె వీధిలో దొరికిన పాత వార్తా పత్రికలను తీసుకుని చదవడం నేర్చుకుంది. 
ఒక పూజారి ఆమెను గమనించి ఆమెకు ఒక పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాడు. 
1923లో, స్కాలర్‌షిప్ తో ఎలియనోర్ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించింది. చక్కగా చదువుకుంది. పేదరికం ఉండకూడదనుకున్న యువతి. అనుకున్నది సాధించిన యువతి. పిల్లల పోషకాహారంపై ప్రత్యేకించి అధ్యయనం చేసింది. 1930 నాటికి, ఆమె శిశువైద్యురాలిగా మారింది.కొన్ని సంవత్సరాల తరువాత, డాక్టర్ ఎలియనోర్ గ్రేవ్స్ అని స్థాయికి ఎదిగి మేఫెయిర్‌లో ఒక క్లినిక్‌కు సారథ్యం వహించింది. 
కానీ ప్రతి సాయంత్రం ఆమె రొట్టె, ఔషధం తీసుకువెళ్ళి ముఖ్యంగా పేద పిల్లలు ఉండే ఇరుగు పొరుగు ప్రాంతాలలో పర్యటిస్తూ వారికి ఇస్తూ ఉండేది.
ఆమె ఇలా చెప్పేది :“నేను యావత్ ప్రపంచాన్ని మార్చలేను, కానీ నేను ఒక చిన్నారి రాత్రిని మార్చగలను.”
ఆమె ది బ్రెడ్ ఆఫ్ డ్రీమ్స్ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఇది అవసరమైన పిల్లలకు ఉచిత భోజనం, వైద్య సంరక్షణను అందించే సంస్థ. ఆమె సంపాదించిన ప్రతి దాన్ని దానం చేసింది. ఆమె తన కోసం ఏమీ ఉంచుకోలేదు.ఎలియనోర్ 1980లో, ఉత్తరాలు, పెయింటింగులతో కూడినఒక చిన్న అద్దె గదిలో మరణించింది.ఆమెకెక్కడా విగ్రహాలు లేవు. ఆమె పేరుతో వీధులు లేవు. కానీ ప్రతి చిన్నారీ ఆకలితీరేలా తింటోంది ఆమె ఫౌండేషన్ వల్ల. కాబట్టే, డాక్టర్ ఎలియనోర్ గ్రేవ్స్ ఇప్పటికీ మన మధ్య ఇంకా బతికే ఉందని పలువురి మాట. 

కామెంట్‌లు