ఒక అడవిలో అందరూ మెచ్చుకునే ఒక బలమైన సింహం ఉండేది. అడవికి రాజైనప్పటికీ, అది తన బలం గురించి, అధికారం గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది కాదు. తనకంటే చిన్న జంతువులను కూడా ప్రేమగా పలకరించి, వాటికి సాయం చేసేది.
ఒకరోజు ఆ అడవికి కొత్తగా ఒక కోతి వచ్చింది. ఆ కోతి అడవిలో అన్నిటికంటే ఎత్తైన మామిడి చెట్టు కొమ్మ మీద కూర్చుని, ఆ స్థానమే తన రాజ్యమన్నట్లుగా భావించేది. ఎప్పుడూ అందరినీ చిన్నచూపు చూస్తూ, గర్వంగా ఉండేది.
"నేను అందరికంటే ఎత్తులో ఉన్నాను కాబట్టి, నేనే గొప్పవాడిని," అని అది మనసులో అనుకునేది.
ఒక వేసవి మధ్యాహ్నం, ఆ సింహం ఆ మామిడి చెట్టు కింద చల్లటి నీడలో విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడు కోతి సింహాన్ని చూసి నవ్వుతూ,
"ఓయ్, అడవి రాజా! నువ్వు నేలమీద ఉన్నావు. నేనేమో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో ఉన్నాను. అంటే, నా స్థానం నీ స్థానం కంటే చాలా గొప్పది కదా! నువ్వు నాకంటే తక్కువ వాడివి," అని వెక్కిరించింది.
అదే సమయంలో, అక్కడ పెద్ద సుడిగాలి సర్రున శబ్దం చేస్తూ వీచింది. గాలి తాకిడికి, నేల మీద పడి ఉన్న ఒక చిన్న పక్షి ఈక చాలా ఎత్తుకు, కోతి కూర్చున్న కొమ్మ కంటే కూడా ఇంకా పైకి తేలిపోయింది.
సింహం శాంతంగా ఆ పక్షి ఈక వైపు చూసి నవ్వి, కోతితో అంది,
"నువ్వు కూర్చున్న స్థానం ఎత్తుగా ఉంది, అంతే. కానీ, ఆ స్థానం నీకు గొప్పతనాన్ని ఇవ్వదు. ఇప్పుడు చూశావా, ఆ పక్షి ఈక నీకంటే ఎంతో ఎత్తుకు వెళ్లింది. ఆ మాత్రానికే ఆ ఈక రాజై పోతుందా? మూర్ఖుడా! గొప్పతనం కూర్చున్న స్థానంలో ఉండదు, మనసులో, గుణంలో ఉంటుంది. నీ కనులు తెరుచుకునే రోజు తప్పక వస్తుంది," అని నెమ్మదిగా చెప్పి, ఆ సింహం తన దారిన తాను వెళ్ళిపోయింది.
కానీ, కోతి ఆ మాటలు పట్టించుకోకుండా మరింత గట్టిగా అరుస్తూ గెంతులు వేసింది.
కొన్ని రోజుల తర్వాత, ఆ అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో చెట్లు విరిగి పడుతున్నాయి. కోతి కూర్చున్న ఆ ఎత్తైన మామిడి చెట్టు కొమ్మ, గాలి తాకిడికి భయంకరంగా ఊగింది. ఎత్తులో ఉండడం వల్ల, కింద పడిపోతానని దాని భయం మరింత పెరిగింది. దాని ఎత్తైన స్థానం దానిని రక్షించలేకపోయింది.
అదే సమయంలో, సింహం అడవి మధ్యలో నిలబడి ఉంది. తన చుట్టూ ఉన్న చిన్న జంతువులు ఆపదలో ఉన్నాయి. ఒక చిన్న జింకపిల్ల పొదలో చిక్కుకుపోయి, వరద నీటిలో తడిచిపోయి వణికిపోతోంది. సింహం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ముందుగా పొదలో ఇరుక్కున్న జింకపిల్లను లాగి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. తరువాత, భయంతో వణికిపోతున్న చిన్న కుందేలును తన పెద్ద పంజా నీడలో నిలబెట్టి, దానికి భద్రత కల్పించింది. సింహం నేల మీద ఉండి కూడా... తన పరోపకార గుణంతో, మంచి నడవడితో ఆ చిన్న జంతువుల పాలిట రక్షకుడిలా నిలిచింది.
తుఫాను తగ్గాక, కోతి భయపడుతూ, కష్టంగా కిందకు దిగింది. సింహం దగ్గరకు వచ్చి, తలదించుకుని నిలబడింది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, కోతి వినయంగా-
"ఓ రాజా! నన్ను క్షమించు. నా స్థానం ఎత్తులో ఉన్నంత మాత్రాన నేను గొప్ప అనుకున్నాను. కానీ, తుఫానులో ఆ ఎత్తైన స్థానమే నాకు భయాన్ని, ఒంటరితనాన్ని, నిస్సహాయతను కలిగించింది. నేను ఎవరికీ సాయం చేయకపోగా, నన్ను నేనే కాపాడుకోలేక పోయాను. నువ్వు నేల మీదే ఉన్నావు. అయినా, నీ సాహసం, మంచి మనసు ఆపదలో ఉన్న జంతువులను కాపాడాయి. నువ్వు నిజమైన రాజువి. కూర్చున్న స్థానం కాదు, చూపించిన గుణమే గొప్పది," అనే నిజాన్ని గ్రహించాను అంది.
సింహం నవ్వి "నీకిప్పుడు అర్థమైంది కదా. గొప్పతనం అనేది మనం కూర్చున్న ఎత్తు మీద కాదు, మనం నలుగురికి చేసే సాయం మీద ఆధారపడి ఉంటుంది." అని సున్నితంగా చెప్పింది.
కోతి అప్పటి నుండి తన గర్వాన్ని వదిలి, అందరితో కలివిడిగా ఉంటూ, ఇతరులకు సహాయం చేయడం నేర్చుకుంది. అడవి జంతువులన్నీ సింహాన్ని, దాని మంచి మనసును మరింతగా గౌరవించాయి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి