బాబోయ్ పెసరట్టా? : సరికొండ శ్రీనివాసరాజు
 దసరా సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి చేరింది సునీత. ఆటలే ఆటలు. మంచి కాలక్షేపం అవుతుంది. "ఈరోజు ఏం టిఫిన్ అమ్మమ్మా?" అని అడిగింది సిరి. "పెసరట్టు" అంది అమ్మమ్మ. "అబ్బ పెసరట్టట. అబ్బ! నాకెంత ఇష్టమో!" అన్నది శ్రుతి. మాకూ బాగా ఇష్టం అన్నారు అక్కడ ఉన్న చిన్నారులు అంతా! "మా అమ్మమ్మ ఎంత మంచిదో!" అన్నది వైదేహి. "ఛీ! నాకు పెసరట్టు అంటే అస్సలు ఇష్టం లేదు. బాబోయ్! పేరు వింటేనే డోకు వస్తుంది." అన్నది సునీత. "దాని కోసం ఇంకో టిఫిన్ చేయరాదు?" అన్నాడు తాతయ్య. 
    టిఫిన్స్ పూర్తి అయ్యాక అందరూ ఒక దగ్గర చేరి తింటున్నారు. సునీత దూరంగా కూర్చుని చపాతీ తింటుంది. "అబ్బ! ఎంత రుచిగా ఉన్నాయో పెసరట్లు! అమ్మమ్మా! ఇంకా కావాలి." అంటూ మళ్ళీ వేయించుకుంది శివాని. మిగతా వాళ్లంతా కూడా నోరూరించుకుంటూ పెసరట్ల రుచిని బాగా వర్ణించుకుంటూ మళ్ళీ పెట్టించుకుంటున్నారు. అది చూస్తున్న సునీతకి తన మనసు అటు లాగేసింది. "మా అమ్మమ్మ ఫీలవుతుందని అమ్మమ్మ కోసం ఒక్కటి తింటా." అని పెసరట్టు వేయించుకొని తిన్నది సునీత. ఇంత మంచి రుచి ఎన్నడూ చూడలేదు. లొట్టలేసుకుంటూ మళ్ళీ మళ్ళీ పెట్టించుకుంది సునీత. "రుచిగా లేనిది ఏదీ ఉండదు. ఏదైనా ఇష్టంగా తింటే రుచిగా ఉంటుంది." అన్నది అమ్మమ్మ. "మరి ఆ చపాతీలు ఎవరు తినాలి?" అన్నాడు వాసు. "తాతయ్య తినాలి." అన్నది వాణి. అందరూ నవ్వారు తాతయ్యతో సహా.

కామెంట్‌లు