పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో తిరుమలరావు విజేతగా నిలిచారు. అంతర్జాలం ద్వారా నదిపై పడవ పాట అను అంశంపై కవితలను ఆహ్వానించగా తిరుమలరావు స్పందించారు. ఆకలి రంగు శీర్షికతో తిరుమలరావు పంపిన కవిత టాప్ టెన్ లో నిలిచి విజేత ప్రశంసాపత్రం సాధించింది. విశ్వసాహితి కళావేదిక జాతీయ ఛైర్ పర్సన్ కొల్లి రమావతి నేతృత్వంలో జరిగిన ఈ పోటీల్లో తిరుమలరావు పంపిన కవితలో అలలపై ఊగిసలాట జీవిత నావ నడకను ఆకలికే ఎరుక కడుపుమంట తీరం చేరేదాకా తప్పదు బ్రతుకు నడక అంటూ రచించారు. అనాదిగా సాపాటు పాటతో ఆకలికి మించిన అనాధ ఉందా అంటూ సమాజ మనుగడను ప్రశ్నించారు. కష్టపడితేనే సౌఖ్యమని అందుకై సిద్ధపడు అంటూ తిరుమలరావు తన కవితలో పిలుపునిచ్చారు. వందలాది కవితల్లో విజేతగా నిలిచిన తిరుమలరావును అభినందిస్తూ కవితల పోటీ న్యాయనిర్ణేతల కమిటీ ప్రతినిధులు జంథ్యాల శరత్ బాబు, షేక్ మహమ్మద్ రఫీ ఈవేమన, జట్టబోయిన శ్రీకాంత్, సమన్వయ కమిటీ బృంద సభ్యులు సత్తివాడ శ్రీకాంత్, గడల శివప్రసాద్, రంగిశెట్టి రమేష్ లు తిరుమలరావును అభినందిస్తూ విజేతపత్రాన్ని పంపారు. తిరుమలరావు సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ విశ్వసాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలో టాప్ ట్వంటీ విజేతగా నిలిచి ప్రశంసా పత్రాన్ని సాధించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం హర్షం వ్యక్తం చేశారు.
బహుమతి పొందిన కవిత
"ఆకలి రంగు":- కుదమ తిరుమలరావు -9505665748
++++++++++++++++++++++++++++++++++++++
తర్వాత పూటకు తిండి సంగతి?
అదే జీవకోటి బతుకు స్థితి!
జీవిత రంగస్థలాన ఆకలి రంగు,
అంతుపట్టలేనంత అంతర్గత హంగు!
మెతుకు విలువ తెలిసేది కడుపు మంటకే,
లోకులంతా లోకువయ్యేదిక్కడే,
మనిషి బ్రతుకునది బతుకు నదిపై ఆటుపోట్లతో,
పడవ అలలపై జీవన గీతి ఆ సాపాటు పాటతో!
ఆకలికి మించిన అనాధ ఉందా,
అది నదిపై పడవ పాట అనాదిగా,
అందుకే కష్టాన్ని ఇష్టపడు,
కష్టించి పనిచేస్తేనే సౌఖ్యమని సిద్ధపడు,
చిత్రకారుని కుంచెకందని వర్ణం,
చిత్రం విచిత్రం ఈ ఆకలి రంగు,
ఒడిదుడుకులే వ్యక్తి పయనం,
నదిపై పడవ పాట లాహిరి గద్గద స్వరం,
అవాంతరాలు లేని నడక పుట్టనేలేదు,
నడత తీరుతోనే ఉంటుంది నడవడిక తీర్పు,
ప్రాణానికి ప్రేమకు ప్రగతికి రూపం లేనట్లే-
శ్వాసకు దాహానికి ఆకలికీ రంగు లేదు అంతం లేదు,
నదిపై పడవ తీరం చేరే దాకా కెరటాల ఊగిసలాట తప్పదు,
జన్మ ధన్యత తీరేదాకా ఆరాటం పోరాటం జనన మరణాల మధ్య!
-----------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి