దానం:- ఎం బిందుమాధవి

 టీవీలో ‘ఫలానా మంత్రి గారు అనాథ ఆశ్రమంలో దుస్తులు, స్వీట్స్ పంచి పెట్టారు’ అనే వార్త చూసి “ఆయనది ఎంత మంచి మనసో కదా” అన్నది పాప విద్య.
‘అబ్బో ఇదేం చూశావు, మొన్న ఇంకొక రాజకీయ నాయకుడు పుస్తకాలు, బూట్లు, చిన్న పిల్లలకి ఆట బొమ్మలు పంచి పెట్టారు తెలుసా. అవన్నీ కొనడానికి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు కదమ్మా’ అన్నాడు బుజ్జి.
“పిచ్చి మొహాల్లారా, అవన్నీ వాళ్ల స్వంత డబ్బులు అనుకుంటున్నారా! “సొమ్మొకడిది సోకొకడిది” అన్నట్టు వీళ్ళ దగ్గర ప్రాపకం సంపాదించటం కోసం ఎవరో అవన్నీ కొని వీళ్ళ చేత ఇప్పించి అలా ఫోటోలు తీసి, టీవీల్లో ప్రచారం చేయిస్తారు. ఎవరూ అలా జేబులో నించి స్వంత డబ్బు ఖర్చు పెట్టరు. ఒక వేల అలా తమ డబ్బే ఇస్తే..ఆదాయ పన్ను శాఖ వారు వీళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుంటారు. అంత నాటకం. మీ బోటి వాళ్ళు అవి చూసి, పాపం నిజమే అనుకుంటారు. మీకు లోకం పోకడ ఇంకా తెలియదు” అన్నది విశాలి.
“నిజంగా ఏ ప్రచారం, పటాటోపం లేకుండా అలా దానాలు చేసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. వాళ్ల దానాల వల్లే ఇంకా కొందరు పేదలకి అవసరాలు తీరుతున్నాయి.”
“ఆ:( నువ్వు అందరి గురించి అలాగే అంటావు. అయినా అలా ప్రచారం చేసుకుంటే తప్పేముంది. అది చూసి ఇంకా కొంత మంది స్ఫూర్తి పొందచ్చు కదా! అలా ఎందుకు ఆలోచించకూడదు” అన్నది విద్య.
పాపకి పన్నెండేళ్ళు, బుజ్జికి పదేళ్లు.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే వయసు వారిది.
“దానం చేసి, దాని గురించి గొప్పగా భావించటం, గర్వపడటం తప్పు అనే ఒక కథ మీకు చెప్పనా”అన్నది విశాలి.
“ఆ:( చెప్పు..చెప్పు. ఇలాంటి కథలు వినటానికి బావుంటాయి” అని ఇద్దరు సర్దుకుని అమ్మకి అనుకుని కూర్చున్నారు.
“మీరు చిన్నప్పుడు “విక్రమ్ ఔర్ బేతాళ్” టీవీ సీరియల్ చూసే వాళ్ళు కదా. ఆ విక్రమ్ ఎవరో తెలుసా? విక్రమాదిత్యుడు అనే రాజు. ఆయన పూర్వం ఉజ్జయిని అనే రాజ్యాన్ని పరిపాలించిన చంద్రగుప్తుడు అనే రాజు కొడుకు. ఆయన ఒక సారి పరమ శివుడి గురించి తపస్సు చేసి, తనకి మరణం లేని వరం ఇమ్మని అడుగుతాడు. అలా ఇవ్వటం కుదరదు అని పరమ శివుడు అంటే..’అయితే ఒక సం ఒక రోజు వయసున్న బాలికకి పుట్టిన వాడి చేతిలోనే నాకు మరణం సంభవించాలి’ అని అడుగుతాడు. శివుడు ‘అలాగే’ అని, వెయ్యి సం లు రాజ్యం చెయ్యగల వరం కూడా విక్రమార్కుడికి ఇస్తాడు.”
“విక్రమార్కుడు అంత గొప్పవాడన్నమాట. అతని సాహసం, ఔదార్యం, దానగుణం, తెలివితేటలు, జ్ఞానం అతనికి ఎంతో కీర్తి తెచ్చి పెట్టాయి. ఒక సారి ఇంద్రుడు స్వర్గ లోకానికి విక్రమార్కుడిని ఆహ్వానించి, తమ ఆస్థాన నర్తకులైన రంభ ఊర్వశి లలో ఎవరు గొప్పవారో నిర్ణయించమంటాడు. రంభ నాట్యం కంటే ఊర్వశి నాట్యంలో గొప్పదనమే కాక శాస్త్రీయత కూడా ఉన్నదని తీర్పు చెబుతాడు. ఇంద్రుడు సంతోషించి విక్రమార్కుడికి ఎన్నో కానుకలతో పాటు అద్భుతమైన నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కూడా బహుకరించాడు. ఆ సింహాసనానికి 32 మెట్లు, వాటి మీద 32 సాలభంజికలు (బొమ్మలు) ఉన్నాయి.”
“విక్రమార్కుడు ఎంత గొప్పవాడైనా మరణం తప్పదు కదా! అలా కొంతకాలానికి విక్రమార్కుడు మరణించాక కాలక్రమేణా ఆ సింహాసనం ఉన్న చోట ఒక మట్టి దిబ్బ ఏర్పడింది.”
“అబ్బా.. నువ్వు చెబుతానన్న ‘దానానికి’ దీనికి ఏమిటి సంబంధం” అన్నాడు విసుగ్గా బుజ్జి.
“అబ్బా ఉండరా. కథ ఆసక్తిగా ఉంది. అమ్మని చెప్పనివ్వు” అన్నది పాప.
“ఉండండి మరి..అన్నిటికీ తొందర అయితే ఎలా? గొప్ప వాళ్ల గురించి, గొప్ప విషయాల గురించి తెలియాలంటే ముందు వాళ్ళ చరిత్ర కొంత చెప్పుకోవాలి. సరే వినండి..అలా భూమిలోకి వెళ్ళిపోయిన సింహాసనం, తరువాతి కాలంలో ఉజ్జయినిని పరిపాలించిన భోజరాజు దగ్గరకి చేరింది.”
“దాని గొప్పతనం అంతకు ముందే స్వయంగా తెలుసుకున్న భోజరాజు..ఒక శుభ ముహూర్తాన ఆ సింహాసనానికి పూజ చేసి దానిమీద కూర్చోవటానికి సిద్ధపడుతున్నప్పుడు..మొదటి మెట్టు మీద ఉన్న బొమ్మ “ఆగు ఆగు” అని అతన్ని వారిస్తుంది. కారణం అడిగిన భోజరాజుతో “నువ్వు విక్రమార్కుడు అంతటి గొప్పవాడివి కాదు. ఆయనకి ఉన్న పౌరుష, సాహసాల గురించి చెప్పటం సామాన్యులకి చేత కాదు. అతని దాన గుణం ముందు ఎవరు సరి తూగరు. అలాంటి చక్రవర్తి అధిష్టించిన సింహాసనం మీద నువ్వు కూర్చోకూడదు” అని చెబుతుంది.
“ఆ మాటలకి భోజుడు ఆశ్చర్యపడి..”ఎవరు అభ్యర్థించినా లేదనకుండా, వారు తృప్తి పడేట్లు నేను ఎంతో గొప్ప దానాలు చేసాను. నా దాన గుణాన్ని అల్పంగా చూడకూడదు” అని గర్వంగా అంటాడు. “దానం చేశాననే గర్వం, అహంకారం కలగటంతోనే నీకు కలిగిన గొప్పతనం, పుణ్యం నశించాయి” అని చెబుతూ..”పూర్వం మన పెద్దలు..ఎవరైనా సరే తమ ఆయుర్దాయం, మంత్రం, ఔషధం, తమ వద్ద గల ధనం, తాము చేసిన దానం, తమకి కలిగిన అవమానం, అన్యాయం, ధన నష్టం, ఇంటి గుట్టు బయటికి చెప్పకూడదు అనే నీతిని చెప్పారు. మీకు తెలియదా” అని అడుగుతుంది.
“ఆ విషయం ఇంకా వివరంగా చెప్పటానికి ఒక కథ కూడా ఉంది. పూర్వం సుదర్శనుడు అనే సూర్య వంశపు రాజు సరయు నదీ తీరంలో అనేక వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టటం ఒక వ్రతంగా ఆచరించాడు. నదీ తీరంలో కొన్ని రోజుల పాటు సత్ర యాగం చేశాడు. అప్పుడు ఆ రాజు గొప్పతనం విని నారదుడు అక్కడికి వచ్చి..బ్రహ్మ లోకంలో నీ దాన ధర్మాల గురించి, నీ సౌశీల్యం గురించి విని, నిన్ను చూసి వెళదామని వచ్చాను అని చెబుతాడు.”
“కులోచిత ధర్మాన్ని పాటించేవారికి అసాధ్యం అనేది ఉండదు. పూర్వం ఋషి పత్నులు ఇసుకతో చేసిన కుండలతో నీరు తెచ్చుకున్నారు. నువ్వు కూడా అలా చేసి నీ సామర్థ్యాన్ని నిరూపించుకో” అని కొంత ఇసుక ఇచ్చి వెళతాడు.
“సుదర్శనుడు అప్పటి వరకు వాడిన మట్టి కుండలు తీసేసి, చాలా కాలం ఆ ఇసుక కుండలతో వంటలు చేయించి దానధర్మాలు చేస్తూ ఉంటాడు. ఒక సారి వంట శాలలోకి వెళ్లి “నేను ఇసుక కుండలతో వంట చేసే ఘనత సాధించాను కదా” అని గర్వ పడతాడు. అతనిలో గర్వం కలిగిన మరుక్షణం ఆ కుండలు విచ్చిపోతాయి.”
“నారదుడు మళ్లీ ఆ రాజుని చూడటానికి వచ్చి, నీలో కలిగిన గర్వం వల్లనే ఆ కుండలు విచ్చిపోయాయి అని చెబుతాడు. కాబట్టి నేను గొప్ప దాతని అని చెప్పుకోగానే నీలో ఆ గొప్పతనం నశించింది” అని చెప్పి మొదటి బొమ్మ భోజుడితో “అలా చేసిన దానానికి గర్వపడే నువ్వు ఈ సింహాసనాన్ని అధిష్టించటానికి అర్హుడువికాదు” అంటుంది.
“ఇప్పుడు తెలిసిందా పిల్లలు..ఈ కథ నేను ఎందుకు చెప్పానో..చిన్న చిన్న దానాలు చేసి పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకునే వారికి ఆ దాన ఫలితం దక్కదు. ఎప్పడు పటాటోపాలు, ప్రచారం మంచివి కాదు. అందుకే మన పెద్దలు..కుడి చేత్తో ఇచ్చే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెబుతారు” అని విశాలి కథ ముగించింది.
“ఓ ఇప్పుడు తెలిసింది. మనిషికి గర్వం మంచిది కాదు. రేపు ఇలాంటిదే ఇంకొక మంచి కథ చెప్పమ్మా” అని ఇద్దరు విశాలి ఒడిలో పడుకుని నిద్రకి ఒరిగారు.
పిల్లలకి అప్పుడప్పుడు..పిల్లలేంటి పెద్దలకి కూడా.. ఇలాంటి కథలు చెప్పి వారి ప్రవర్తనని సరిదిద్దటం, నడవడిక నేర్పటం, ఆర్తుల పట్ల దయ, జాలి కలిగి ఉండ వలసిన సామాజిక బాధ్యత నేర్పటం..ఇంట్లో తల్లిదండ్రులకి, స్కూల్లో టీచర్లకి బాధ్యత.
[కొంపెల్ల రామకృష్ణ మూర్తి గారు రచించిన భోజ - సాలభంజికల కథలు పుస్తకం లోని కథ ఇది. గోరంత ఉపకారం చేసి..కొండంత ప్రచారం చేసుకునే మన రాజకీయ నాయకులని చూస్తున్నప్పుడు స్ఫురించిన కథ]

కామెంట్‌లు