స్నేహ సాహిత్య సూర్యోదయం..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ఓ మిత్రమా పదాల పుటలలో
పూసిన పుష్పం మన స్నేహం...
భావాల గాలిలో పరిమళించిన
సుస్వర సుమధుర సుగంధం...

భాషా భవనం మనకో దేవాలయం...
పదాల పండుగ మనకో మహోత్సవం.

మీ మాటలు తేనె జల్లులలై రాలగా...
నా మనసు నింగిలో తారై మెరిసింది...

సాహిత్య సూర్యోదయం
మన కలలకు కాంతి...
మాటల గంగా ప్రవాహం
మన మనసుల్లో మ్రోగే మంజీరనాదం..

ఉపమానాల ఊయలలూగుతూ
మనం లిఖించిన ప్రతి వాక్యం
మన స్నేహాసౌధానికి ప్రత్యక్షసాక్ష్యం...

మాటల్లో ముత్యాలు,
భావాల్లో మాణిక్యాలు,
మన సాహితీ సృజనలో
కార్తీకదీప కాంతులై మెరిశాయి...

ప్రతి కవితలో
ఉంది మన ఊపిరే... 
ప్రతి అక్షరంతో ఉందొక
ఆత్మీయ అనుబంధం...

నీవు ప్రేమగా పలికిన మన
“సాహిత్య మాణిక్యాల సందడి”
"నాలో "దివ్యమైన దివిటిలా" వెలిగింది...

మన స్నేహం ఒక సాహితీ సముద్రమే...
పొంగే ప్రతిఅల చేరాలి ఆనందతీరమే...

మన కలం కేవలం కలం కాదు మిత్రమా
అది భావాల దీపస్తంభం హృదయ దీపిక...

ఔను స్నేహం, సాహిత్యం కలిస్తే 
అక్షరాలే ఆణిముత్యాలౌతాయి...
మనసులు రెండూ కలిస్తే కలిసి నడిస్తే
కాలమే ఓ కమ్మని కవితగా మారుతుంది.



కామెంట్‌లు