సామెత -13: అయినోళ్ళకు/ అయిన వాళ్ళకు ఆకుల్లో - కానోళ్ళకు కంచాల్లో...
*****
"ఏంది!బిడ్డా? గట్లున్నవేంది? నీళ్ళ తేడా జేసి పడిషం గాని పట్టిందా ఏంది? కళ్ళుబ్బి మంకెన పూలొతికె అయినయ్. ముఖమంత బురబురలాడుతుంది.ఒచ్చిన్నాడు ఉన్న ఉషారు మచ్చుకైన కనబడ్డంలేదు".
బల్లెపీట మీద కూసున్న భారతిని జూసి చేస్తున్న పనాపి పక్కనే కూసుని నుదుటిపై చేయి పెట్టి జొరంగాని వచ్చిందా? ఏందని సూత్తున్న అవ్వ సేతుల్లో ముఖం బెట్టి ఎక్కి ఎక్కి ఏడ్సింది.
అయ్యో! ఏమైంది బిడ్డా! ఏం కట్టమొచ్చింది? రాక రాక చాన్నాళ్ళకి రాఖీ పువ్వు పండగని వొచ్చినవ్. దేశం గాని దేశంలో బతుకుతుండవు.నిన్ను జూసి ఊరు ఊరే సంబుర పడుతోంది. పిల్లల నీళ్ళాడటాన్కి వచ్చి పోయిందానివి.మళ్ళ గిన్నాళ్ళకు కళ్ళబడ్డవ్. బుడ్డ పొల్లగాండ్లిద్దరూ ముద్దుగ తెల్లజాంపండ్లొతికె ఉన్నరు.ఏమైంది బిడ్డా!గంత దుఃఖపడుతున్నవ్."
కళ్ళ నీళ్ళకు చెంపల పొంటి అతుక్కున్న వెంట్రుకల్ని సవరిస్తూ అంది.
ఏం జెప్పనవ్వా! నే నట్ట జాతకురాల్ని.అమ్మ నాయిన ఎట్టాగూ లేరు.ఉన్నొక్క అన్న కళ్ళల మెసులుతుంటే సూడబుద్దై మా ఆయన్ని బతిలాడి,బతిలాడి ఒప్పించి కొడుకుల్ని తీస్కొని వచ్చిన.
వచ్చేప్పుడు అన్నకి వదినకి, పిల్లలకు సూరత్ నుంచి మంచి బట్టలు కొనుక్కొచ్చిన.గింత పేమ నింపుకోని రాఖి పువ్వు కట్టొచ్చిన నన్ను గిట్ల జేసుడేమన్న బాగుందా?
"అయినోళ్ళకు ఆకుల్లో - కానోళ్ళకు కంచాల్లో అన్నట్లు" వొచ్చిందగ్గర్నించి సూత్తున్న .వొదిన దోస్తట. నా లెక్కనే ఇద్దరు పిల్లల్నేసుకుని వచ్చింది. ఆళ్ళని ఏంగావాలే ? ఏం గావాలని మంచిగ అర్సుకొనుడు. అవ్వ!ఎవలైన కానోళ్ళకు కంచాల్లో తిండి బెట్టుడుందా? గిదేం సోద్యం అవ్వా! మా వదినెకి మేం పరాయోళ్ళయినం.గందుకే కానోళ్ళొతికే యిస్తరాకుల్ల బెట్టింది.గక్కడితో ఆగిందా? అన్నతో యాట మాసమే దెప్పించింది,ఇంట్లున్న గుడ్ల కోడ్నే కోయించింది.ఆళ్ళకేమో ముక్కలు,తునకలు దేవి దేవి పెట్టుడు. మాకేవోఁ పితుకంత రెండు ముక్కలు.గింత అంటు.గంత షోర్వ. పోరగాండ్లిద్దరూ గాళ్ళు లొట్టలేసుకుంట తినే ముక్కొంక బొక్కొంక జూత్తుంటే మనసంత కలికలి అయ్యిందవ్వా !" గిట్ల బంతిల వలపచ్చం చేత్తూ","పొమ్మన లేక పొగబెట్టినట్టుంటే" ఎంత దుఃఖం వత్తది నువ్వే చెప్పవ్వా?
ముక్కు చీది కళ్ళు తుడ్సుకుంటున్న బారతిని గుండెలకు అత్తుకుంటూ... "కలికాలమే తల్లీ! కలికాలం! ఒక్కగా నొక్క తోడబుట్టిన దానివి. నీ అన్నకయినా కూసింత బుద్ధుండొద్దు."నోట్లో నాలిక లేనోడు" అనుకున్నగని, మరీ ఇసంటోడని అనుకోలే... రెన్నాళ్ళు నా యింట్ల ఉండిపో బిడ్డ!"
"అయ్యో! అన్న పరువు బోద్ది అవ్వా! నువ్వే అన్నవుగా "నోట్లో నాలిక లేనోడని".గందుకే వొదినె కొంగున గట్టేసుకుంది.ఇగ్గో గీ పైసలు తీస్కొని మా తల్లి ముగ్గురికి బట్టలు దే అవ్వా! తల్లి ముగ్గురికి అన్న బెట్టిండని మా ఆయన్కి జెప్తా!"
గా మాటలకు అవ్వ మనసులో.గిట్ల ఎంత దుఃఖాన్నైనా,అగమానమైనా కడ్పుల దాసుకొని పుట్టింటోళ్ళ బాగు కోరుకుంటది గద ఆడిపిల్ల"అనుకుంట "నా తాన ఉన్నయితీ! గిది గూడ నీ పుట్టిల్లే అన్కో! మనం పరాయోళ్ళమా జెప్పు."
ఇంగ దా అని బట్టల దుక్ణానికి తోల్కపోయి ముగ్గురికీ నచ్చిన బట్టలు ఇప్పించింది.ఓ పూట ఇంటికి పిల్సి ముక్క ,బొక్క కూరల్తో కడుపు నిండ పెట్టినంక గని అవ్వ మనసు తుత్తి పల్లే.
గిదండీ సంగతి " "అయినోళ్ళకు ఆకుల్లో -కానోళ్ళకు కంచాల్లో" అంటే.. ఎనకట గానీ ,గిప్పుడు గానీ బాగా అయినోళ్ళకు, రక్త సంబంధీకులకు అంటు సొంటు తేడా సూపకుండ తినే కంచాల్లో పెడతారు. సుట్టాలకు పరాయోళ్ళకు, ఆకుళ్ళ బెడతరు.గిట్ల ఆకుళ్ళ బెడితే అయినోళ్ళను అవమానించినట్టే. ఇదే సామెతను చానా విషయాల్లో, సందర్భాల్లో అన్వయించుకుంటరు!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి