సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -21: -"అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు "
****
ఎన్నడూ లేంది భూలచ్మి  బడ్నించి రాంగనే సంచిల్నించి వొయ్యిలన్ని నేలకి యిసిరిసిరి కొడ్తుంటే బుడ్డోడు ఉరుక్కుంట అవ్వ దగ్గర్కి బొయ్యి "అక్క తిక్క తిక్క చేత్తుంది."వొయ్యిలన్ని నేలకి యిసిరిసిరి కొడ్తుందని" షికాయతి జెప్పిండు.
బుద్ధిగుండే పొల్ల ఎన్నల్లేంది గట్లెట్ల జేత్తుంది? "ఈ మద్దెన గావురం ఎక్కువైంది.సింత బరిగెందుకుని పెళ్ళిజేత్తె పొల్లకి దెబ్బకి దెయ్యం దిగుతుంది.బాయి పక్కనున్న  సింత సెట్టు కొమ్మిరిసి ఆకుల్ని దూసి భూలచ్మి కాడికి వచ్చింది.
ఇంటి ముంగలున్న అర్రల వొయ్యిలన్నీ సిందరవందరగ పడున్నయి. భూలచ్మి శివమొచ్చినదాని లెక్క  "సారు నన్నెందుకు గొట్టిండు.ఇంగ నేను బల్లెకేబోను నాకీ వయ్యిలేమొద్దు. పావుబత్తంత ఏస్కొనిబోయిన సంచిల్నించి ఎతికెతికి తీసి యిసిరిగొట్ట బొయ్యేదల్ల అవ్వ సేతిల సింత బరిగె జూసి గజ్జున వొణుక్కుంట ..
" అవ్వా! మరీ మరీ మా సారు నాపక్కున్నోళ్ళని యిడిచిబట్టి నేనేం లొల్లి జెయ్యకుండనే నన్ను బయ్య బయ్య ఈపుల బాదిండు" బోరుమని ఏడ్వడం మొదలు పెట్టింది.
ఇంగ సారె గొట్టె నేనెందుకుతీ మల్ల గొట్టుడు మనసుల అన్కుంట" అత్త మీద కోపం దుత్త మీద సూపినవన్న మాట. బల్లె మీ సారట్లెనే జేశిండు.ఇంటికొచ్చి నువ్వట్లనే జేసినవ్.పొల్ల! గా వొయ్యిలు నిన్నేం జేశినయ్. నోరూ వాయిలేనివి. ఆటిల్ల సదువులతల్లి ఉంటది.ఆటినట్ట యిసర్తరా ఎవులైన?.ఇంగ నువ్వట్ట యిసిర్నవని గా తల్లి నిన్నొళ్ళనని కోపంతో వదిలెల్తది.గప్పుడు నువ్వు తల్కాయ కిందికి కాల్లు పైకి బెట్టినా అచ్చరమ్ముక్కంటదు?
అత్త మీద కోపం.... మిగిలింది రాక బుడ్డోడు అవస్థ బడ్తుంటే.. "దుత్త మీద సూపినట్టంటే ఏందవ్వా?" భూలచ్మి  కళ్ళు ముక్కు గౌనుతో తుడ్సుకుంట"ఒక్కో వయ్యికి దండాలు బెట్కుంట,గుండెలకు అత్తుకుంట.వాటికంటిన మట్టిని సుబ్బరంగ దుల్పి మల్ల సంచిల బెట్కుంట అడిగింది.
 పొల్ల దారికొత్తాంది" అన్కుంట "ముందుగాల గవన్ని మడ్తబెట్టి అందుట్ల బెట్టిరా."*అనంగనే బుడ్డోడు గూడ అక్క వయ్యిలు సద్దుట్ల కూసింత సాయం చేసి, అక్కతో కల్సి బుద్ధిగ యినేందుకు అవ్వ తానకొచ్చి నిలబడ్డడు.
అనగనగా ఓ ఉళ్ళే ఓ గంపగయ్యాలి అత్తుండేది.కొడ్కు పెళ్లి సేసింది మొదలు కోడల్ని కన్నమ్మ కట్టాలు బెట్టుడు మొదలు బెట్టింది.కూసోనియ్యదు.నిలువనియ్యదు.అన్నిటికి వొంకలు బెట్టుడు. కొడుక్కి కోడల్మీద షికాయితులు జెప్పి తిట్టిచ్చుడు.
అత్త మీద కోపం రాన్రానూ పెద్ద గుట్టంత పెరగడం మొదలైంది."మల్లె వడదమంటే మొగుడితో తంట.మాటకి మాటందమంటె అత్తో పెంట" రచ్చ రచ్చ జేత్తది" అన్కొని బగ్గ ఆలోచించింది.
భూలచ్మి రేపు తాను సుత బల్లేం జేయాలని ఆలోచించుకుంట అవ్వ మాటలు ఇట్టంగ ఇన్కుంట ఊకొడ్తాంది.
గిప్పుడన్ని ఇట్టీలు చెంబులు,తప్పాలాలు. గాదినాల్లో పతొక్కరిండ్లల్ల మట్టి కుండలు,అటికెలు,దుత్తలే ఆడేటోళ్ళం.
"దుత్తంటేందవ్వా? ఆత్రమాపుకోలేక అడిగింది భూలచ్మి.
గదే నే జెప్పబోతున్న.నీ ఆత్రం అమ్మగాను"దుత్తంటే చిన్న మట్టి కుండనే. గా దాంట్లో పాలు కాగబెట్టి తోడేసేటోళ్ళు. దాంతో సల్ల సిలుకుతనని  చేతిల కవ్వం బట్కొని కోడల్ని దెమ్మంది.అసలే గొంతు దాక అత్తమీద కోపమున్న ఆ కోడలు తీస్కొచ్చుకుంట చెయ్యి జార్చింది. నేలమీద బడ్డ దుత్త పట్టున పదారు ముక్కలైంది. గానాడింట్లో ఎవ్వలికీ సల్ల సుక్క లేకుండైంది. గట్ల అత్త మీద ఉన్న కోపాన్ని కోడలు దుత్త మీద సూపిందన్న మాట.
గట్లనే కోడలు మల్ల మల్ల జేయడం జూసి.గిదంతా తనమీద కోపంతో జేత్తుందని అర్థమై " ఈ "అత్త మీద కోపం దుత్త మీద సూపిత్తున్నవ్ గని నట్టబొయ్యేది నువ్వే.నీ మొగుడు పనికి బొయ్యి తెత్తెనే మనిల్లు గడిసేది. గన్ని దుత్తలు పగులగొట్టినవ్. ఎన్ని పైసలైనయో లెక్కేస్కో" అందట.అయ్యో నా మొగుడి కట్టాన్నే గిట్ల నేలపాలు జేత్తున్ననా? అన్కొని తప్పు దెల్సుకుందట కోడలు.
ఆ మాటలు విన్న భూలచ్మికి అసలు సారెందుకు గొట్టిండో యాది కొచ్చింది.ఏవో కాయితాల మీద అర్జెంటని రాస్కుంటుంటే పొల్ల గాల్ల లొల్లికి తట్టుకోలేక ముందు ఇద్దర్నీ..ఆనెక్క తనని బాదిండు. నేను గట్ల లొల్లి సెయ్యొద్దని పక్కోళ్ళకు జెప్తుంటే నేనే లొల్లి జేసిననుకుండు. గిప్పుడు వొయ్యిలన్ని నేలకి యిసిరిన నాకు సదువొత్తదో రాదో? "అవ్వా! తప్పైందే.వొయ్యిలకు మంచిగనే మొక్కిన నాకు సదువొచ్చెటట్టు సూడమని" అంటున్న మన్వరాలి అమాయికత్వానికి జాలి పడ్కుంట తల మీద నిమురుతూ "ఇంగెప్పుడట్ల జెయ్యొద్దని" మాట దీస్కుందవ్వ.
గదండీ సంగతి! "అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అంటే".. అలా సూపడం వల్ల మనకే నష్టమనే అర్థంతో మన పెద్దోళ్ళు ఈ సామెత వాడుతరు.

కామెంట్‌లు