సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము-ద్వితీయాశ్వాసము: - 11 వ రోజు
పరీక్షిత్తు శాపం
తక్షకుని మీద పగ పట్టిన ఉదంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు. జనమేజయుడు మంత్రులను రావించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు. మంత్రులు ఇలా వివరించ సాగారు. అర్జుని కుమారుడు అభిమన్యుడు. అతని భార్య ఉత్తర. ఉత్తరాభిమన్యుల కుమారుడు మీ తండ్రిగారైన పరీక్షిత్తు. పరీక్షిత్తుఒకరోజు మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళి దప్పిగొన్నాడు. అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ శమీకుని ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న శమీకుని " అయ్యా ఇటు వైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా" అని అడిగాడు. ధ్యాన మగ్ధుడైన శమీకుడు బదులివ్వలేదు. ఆ కారణంగా ఆగ్రహించి పరీక్షిత్తు అక్కడ చచ్చి పడిన పాముని తీసి అతని మెడలో వేసాడు. ఆ తరువాత హస్థినాపురం వెళ్ళాడు. ఆ సమయంలో శమీకుని కుమారుడైన శృంగి లేడు. శమీక మహర్షి కుమారుడైన శృంగి సహధ్యాయి, మిత్రుడైన కృశుడు ఇది చూసాడు. కృశుడు శృంగి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు. అది విన్న శృంగి " అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజులలో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించు గాక" అని శపించాడు. జరిగినదంతా శృంగి ద్వారా తెలుసుకున్న శమీకుడు బాధపడి " కుమారా కోపం అనర్ధ హేతువు. మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనలను రక్షించే రాజే కారణం. పరీక్షిత్తు ధర్మ రక్షకుడు. ఆకలి దప్పులకు ఆగలేక విసుగులో ఈ పని చేసాడు. నీ శాపాన్ని ఉపసంహరించు " అన్నాడు. అందుకు శృంగి అంగీకరించ లేదు. శమీకుడు గౌరిముఖుడు అనే శిష్యుని పిలిచి పరీక్షిత్తుని కలసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు. గౌరిముఖుని ద్వారా విషయం తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.ఏడవ రోజు వచ్చింది. పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మ దేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేసించాడు. కశ్యపుడు శాపోపహతుడైన పరీక్షిత్తుని రక్షించడానికి బయలుదేరాడు. శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుని మార్గ మధ్యంలో కలిసాడు. తక్షకుడు కశ్యపుడు పరీక్షిత్తుని రక్షించడానికి వెళుతున్నాడని తెలుసుకున్నాడు. తక్షకుడు కశ్యపునితో పరీక్షిత్తుని రక్షించడం అసంభవం అన్నాడు. కశ్యపుడు అంగీకరించ లేదు. తక్షకుడు పక్కన ఉన్న వృక్షాన్ని కాటు వేసి దాన్ని బతికించు చూద్దాం అన్నాడు. కశ్యపుడు ఆ బూడిదను మంత్రించి జీవింప చేసాడు. తక్షకుడు కశ్యపునితో " మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగు లేనిది. మహారాజు ఇచ్చేవాటికన్నా నేను అధికం ఇస్తాను తిరిగి వెళ్ళు " అన్నాడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్ళాడు.. తర్వాత తక్షకుడు నాగ కుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి పరీక్షిత్తుకు పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తాను ఆ పండ్లలో క్రిమి రూపంలో దాక్కున్నాడు. పరీక్షిత్తు దగ్గరకు చేరిన తక్షకుడు ఆయన పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నులు చిమ్ముతూ కాటు వేసి పరీక్షిత్తును చంపాడు. ఓ మంత్రులారా! తక్షకుడికి కాశ్యప బ్రాహ్మణుడికి మధ్య జరిగిని ఈ సంభాషణ మీకు ఎలా తెలిసిందని జనమేజయ మహారాజు అడుగగా మంత్రులు తక్షకుడు కాటువేసిన పచ్చని వృక్షం కొమ్మమీద అంతకు ముందే ఓ కట్టెలు కొట్టేవాడు ఎక్కి వున్నాడు. వాడిని తక్షకుడు గాని బ్రాహ్మణుడు గాని చూడలేదు. వాడు తక్షకుని కాటుతో కాలి బూడిద అయి మరల కశ్యపుని మంత్రప్రభావంచేత ఆ చెట్టుతో పాటు బ్రతికి మా వద్దకు వచ్చి ఆ విషయమును చెప్పాడు. మేము విన్నది చూసినది మీకు వివరించాము. మీకు ఏది ఉచితం అనిపిస్తే దానిని ఆచరించండి అని అన్నారు.


భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు