సామెతల ఊట -సునందమ్మ నోట :- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ,ఖమ్మం

 సామెత -6: అతి వినయం -ధూర్త లక్షణం
****
"అవ్వా! అవ్వా! "అతి వినయం -ధూర్త లక్షణం అంటేంది చెప్పవా?..
కత చెప్పమని నాల్దినాల సంధి ఒకటే నస బెడుతువున్నవ్ గద. చెప్త పా " అనంగనే  నా దోస్తులను దీసుకొత్త పెయ్య దుడ్డోలే గంతులేస్కుంట బోయింది.చటుక్కున  పది మందిని ఎంటేసుకొచ్చిన భూలచ్మిని,పిలగాండ్లను అబ్బురంగ జూసుకుంట "కతలంటే ఎంత ఆపాచ్ఛనో" అనుకుంది.
అనగనగా ఓ సాములోరు. అట్టాంటి ఇట్టాంటి సాములోరు గాదు. ముఖానికి బూడిద పూతలు.మెళ్ళో పూసల దండలు.మన జెండా పైరంగు తెల్సుగా కాషాయం గుడ్డతో కుట్టించుకున్న లంబా చౌడా బట్టలు." వింటున్న భూలచ్మి కిసుక్కున నవ్వింది." గట్ల నవ్వితే కళ్ళు బోతయ్.వింటున్న ఓ పిలగాడు.అంతిన్నంక సూద్దాం. వినుండ్రి" బుద్ధిగ సద్దుకుని చెవులు రిక్కించారు.
 ఆ సాములోరు ఊళ్ళో గుళ్ళో తిష్ట ఏశాడు. జనాలంత పడీ పడీ మొక్కుడు.చెయ్యి చూపించుకునుడు.పదో పరకో ఆయన తెచ్చుకున్న సంచీలో ఏసుడు. సాములోరి పండగ పండింది.భక్తుల పసాదాలతో పొట్ట నిండుతోంది.పైసలకు పైసలు.పైంగ గౌరవం. అద్దమ రాతిరి పైసలు లెక్కేసుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యిండు. పెద్ద గుడ్డ సంచికి  లోపల పైకి కనబడకుండా కానాలు కానాలు కుట్టిండు. ఒక్కో కానాలో నగా నట్రా,పదులు, నాణాలు భద్రంగా దాచి పెట్టడం మొదలు పెట్టిండు.
 గిదంతా భక్తుడి పేరుతో వచ్చిన ఓ దొంగ కనిపెట్టిండు.సాములోరికి వద్దన్నా సేవలు జేయడం  మొదలు పెట్టిండు. పాదాలొత్తడం దగ్గర్నుంచి. ఇతర భక్తులు ఏమిచ్చినా జాగర్త చేసి అతి వినయంగా సాములోరికి ఇవ్వడం.
గదంతా జూస్తున్న సాములోరికి ఆ భక్తుడిపై మస్తు గురి కుదిరింది. ఆ వూరి నుంచి మరో చోటికి వెళ్తున్న సాములోరిని యిడిచి ఉండలేనని,వస్తనని వేడుకుండు. సాములోరు సరే అన్నడు.
ఓ రోజు  ఇద్దరు పక్కూరికి వెళ్ళి వచ్చిండ్రు. తన బట్టలకు అంటుకున్న గడ్డిపోస చూసి అయ్యో! అయ్యో! ఎంత ఘోరం జరిగిపోయింది. ఊళ్ళో కెళ్ళినప్పుడు మనం గూసున్న ఇంటోళ్ళ గడ్డిపోస బట్టకంటుకుంది.ఎంటనే ఇచ్చి రావాలి.పరుల సొమ్ము పామసుమంటింది సామీ! ఇచ్చొస్తా అని ఉరికి ఉరికి పోయి వచ్చిండు.
సాములోరికి మరింత గురి కుదిరింది. తన సొమ్మున్న సంచి  ఇసుమంటి వాడికిస్తే యాడికి బోదు "ఎంత వినయం, ఎంత విధేయత" అనుకున్నడు. 
ఓ రోజు ఊళ్ళోకి ఎళుతూ సంచిని ఆ భక్తుడికి పట్టుకొమ్మని ఇచ్చిండు. ఎంతో వినయంగా దాన్ని పట్టుకొని సాములోరు జనంలో ఉండంగ పరారై పోయిండు. ఎంత ఎతికినా దొరకలేదు. ఆ సంచి విషయం చెబితే ఊరోళ్ళు తంతరని లోలోపల ఏడుస్తూ అక్కడ్నుంచి ఎళ్ళిపోయిండా సాములోరు.
"గదిరా కత! అనంగనే "దొంగ సాములోరికి- దొంగ భక్తుడు" బాగయ్యిందని సంకలు కొడుతూ.. "అతి వినయం ధూర్త లక్షణం" అంటే అర్థమయ్యిందవ్వా! అన్నరు.
అదండీ సంగతి "అతి వినయం-ధూర్త లక్షణం" అంటే ఇదే.అతి అంటే ఎక్కువ. వినయం అంటే విధేయత, నడవడిక.ధూర్త అనగా దుష్టుల.లక్షణం అనగా గుణం, స్వభావం.అతి వినయం చూపేవారిని ఓ కంట జాగర్తగా కనిపెట్టాలి.
కామెంట్‌లు