శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము :- భాగం - 19
 "సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
హయగ్రీవ - అగస్త్య సంవాదం - శ్రీలలితా మహాత్రిపురసుందరి - నిండు పేరోలగము
అమ్మ మాటలను, హయగ్రీవస్వామి అగస్త్యునికి ఇలా తెలియజేస్తున్నారు.....
ఓ! వశిన్యాది వాగ్దేవతలారా! మీరు నా యొక్క తెల్లని తేజస్సు నుండి వచ్చిన వారు. మీకు వున్న వాక్కు అనే సంపదతో, మీరు నా భక్తులకు వారు కోరుకున్న ఆనందాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని నియమించాను. మీరు శ్రీచక్రము యొక్క రహస్యము తెలిసిన వారు. నా నామ స్తోత్రము చేయాలనే కోరికతో ఎల్లప్పుడూ వుంటారు. అందువలన, ఏ రహస్యములైన నా సహస్ర నామాలను చెపితే నేను సంతోషం పొందుతానో, ఆ సహస్ర నామాలను మీరు చెప్పండి.
అమ్మ మాటను శిరసున వుంచి, వశిన్యాది దేవతలు, శ్రేష్టమైన, అతి రహస్యములైన, ‌శ్రీలలితా సహస్రనామ స్తోత్రమును చేసారు.
*ఓ! అగస్త్య మహర్షి! ఒకనాడు అమ్మ శ్రీలలితాంబిక తన సభలో కొలువు చేసింది. ఆనాటి సభకు, కోట్లాది బ్రాహ్మిణీలు, బ్రహ్మ, ఉపేంద్రుడు, మిగిలిన దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారు. కల్పానికి ఒక్కొక్కరుగా కోట్లకొలది లక్ష్మీదేవులతో నారాయణులు, గౌరీదేవులతో రుద్రులు, శ్రీమత్సింహాసనేశ్వరి అని కీర్తింపబడటానికి సిద్ధమై కూర్చున్న ఆ దేవ దేవిని, పరాభట్టారికను సేవించడానికి వచ్చారు. మన్త్రిణి అయిన శ్యామలాంబ, దండనతో దుఃఖాలను పోగొట్టే వారాహి దేవి వంటి దేవీ శక్తులు, పరాశక్తి, ఆదిశక్తి, కాళరాత్రి, శుభద్రిక వంటి శక్తి సమూహాలైన 33 మంది శక్తి రూపాలు కూడా సభాప్రాంగణములోకి వచ్చారు. సనకాది సిద్ధులు, సూర్య చంద్రులు, వసువులు వచ్చి వున్నారు.  *
అలా తన సభకు వచ్చిన వారిని అందరినీ తన కంటి సైగతోనే, వారి వారి వుచితాసనాలపై కూర్చోండి అని చెప్పింది, పరమేశ్వరి.
ఆ తరువాత అమ్మ చల్లని చూపుతో, వశిన్యాది వాగ్దేవతలు వారు రచించిన "శ్రీలలితా రహస్య సహస్రనామాలను" అతిమధురంగా గానం చేశారు. ఆ స్తోత్రం విన్న అమ్మ, అమితంగా ఆనందించింది. ఇది చూసి పేరోలగం లో వున్న దేవతా సమూహం ఆశ్చర్యపోయారు.
*తన ఆనందరూపాన్ని చూసిన దేవతల ఆశ్చర్యాన్ని చూసిన పరమేశ్వరి, వారితో...."వశిన్యాది దేవతలు చేసిన ఈ నా సహస్రనామ స్తోత్రము, నా ప్రేరణ తోనే రాయబడింది. ఈ నామ పారాయణ తో నేను చాలా ఆనందం పొందుతాను. నన్ను ఇంకా ఎక్కువ ఆనందంతో చూడాలి అనుకుంటే, మీరు అందరూ కూడా ఈ నా నామ స్తోత్రాన్ని చేయండి" అని చెప్పింది. *
లలితా సహస్రనామ స్తోత్రము ఒక స్తోత్ర రాజము.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు