శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము - భాగం - 20
 "సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.

హయగ్రీవస్వామి అగస్త్యునికి ఇలా తెలియజేస్తున్నారు.....
1. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - ఎవరికి చెప్పకూడదు
 కుంచించుకు పోయిన మనస్తత్వం వున్న వారికి, దుర్బుద్ధితో వుండే వారికి, దుష్టులకు, విశ్వాసం, భక్తి, దైవశక్తి పట్ల గౌరవ భావము లేని వారికి, పలికేటప్పుడు తప్పులు పలికే వారికి, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ చెప్పకూడదు, అని హయగ్రీవ స్వామి చెప్పారు.
2. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - ఎవరికి చెప్పవచ్చు
 ఎవరయితే దైవశక్తి పట్ల గౌరవం, భక్తి కలిగి వుంటారో, ఎవరు గురువు పట్ల, దైవం పట్ల వినయంగా విధేయతతో వుంటారో, ఉచ్ఛారణ దోషాలు రాకుండా నామాలను పలుకగలిగే వారికి, ప్రతీ రోజూ తమను నడిపిస్తున్న దైవ శక్తిని నమ్మేవారికి మాత్రమే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ చెప్పవచ్చు, అని హయగ్రీవ స్వామి చెప్పారు.
3. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - అంతర్యాగము
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ పారాయణ చేయడము అంటే మన చుట్టూ వున్న వారు అందరికీ వినిపించాలి అనేవిధంగా, ఇప్పటి రోజుల్లో మైకులు పట్టుకునే సౌలభ్యం కూడా దొరుకుతుంది కనుక, బిగ్గరగా నామాలు చెపుతూ, కంఠ శోష పడుతూ, భక్తి భావం వుందో లేదో తెలియకుండా చేయడం కాదు. 
నెమ్మదిగా, ఇంకా వీలైతే మౌనంగా, మంత్రం పెదవి దాటి బయటకు రాకుండా, మనసులోనే, మనకు మాత్రమే వినిపిస్తూ, తలపుల లోపలికి వెళ్ళి, అమ్మ రూపం స్థిరంగా నిలిచిపోయేలా పారాయణ చేయడమే - "అంతర్యాగము" అని అగస్త్యునికి హయగ్రీవ స్వామి చెప్పారు.
మన ధర్మం ప్రకారం మనకు వున్న 60 కోట్లమంది దేవీ దేవతలలో, కోట్లకొలది దేవీ సహస్ర నామములు వున్నాయి. వాటిలో, 1) గంగా, 2) గాయత్రీ, 3) శ్యామలా, 4) లలితా, 5) కామేశ్వరీ, 6) వారాహీ, 7) లక్ష్మీ, 8) రాజరాజేశ్వరీ, 9) సరస్వతీ, 10) భవానీ సహస్రనామములు త్వరగా కార్య సిద్ధిని కలిగిస్తాయి. 
పైన చెప్పిన 10 స్తోత్రములలో శ్రీలలితా సహస్రనామములు ఎంతో ముఖ్యమైన సహస్రనామములు. ఈ శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తో అమ్మ ఎంతో త్వరగా అమితమైన ఆనందాన్ని పొందుతుంది. భక్తునికి త్వరగా ఆర్తిని దూరం చేస్తుంది.
లలితా సహస్రనామ స్తోత్రము - ఒక స్తోత్ర రాజము.
రేపటి నుండి మనం అమ్మ నామాలను స్మరించుకుందాము.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు