శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 22
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
1. శ్రీమాతా (త్ర్యక్షరీ)
2. శ్రీమహారాజ్ఞి (పంచాక్షరీ)
రెండవ నామ మంత్రము - ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః
ఈ తల్లి ఒక చిన్న రాజ్యానికి రాణి కాదు. కొంతమంది చిన్న రాణులకు కలిపి ఒక మహారాణి. కొంతమంది మహారాణులకు కలిపి ఒక  మహారాజ్ఞి. ఈ తల్లి కేవలం  "మహారాజ్ఞి" మాత్రమే కాదు, తన పాలనలో వున్న చరాచర జగత్తు కు మంచి మాత్రమే చేసే, రారాణి. అందుకే, ఈ అమ్మను  శ్రీమహారాజ్ఞి అన్నారు వశిన్యాది వాగ్దేవతలు.
ఈ అమ్మ, నేను ఏమిచేసినా చెల్లిపోతుంది అనుకుని కర్కశమైన, గర్వంతో కూడిన రాణి కాదు. తన పాలనలో వున్న ప్రతీ జీవి, అది భూచరమైనా, జలచరమైనా, నభోచరమైనా, రెండు కాళ్ళ మానవుడైనా, నాలుగుకాళ్ళ జంతువైనా, దేవీ దేవతలైనా, ఆఖరికి తామస లక్షణాలు కలిగిన రాక్షసులైనా వారి వారి పరిధిలో వుండేటట్లు చూస్తుంది. అందరినీ కరుణా దృష్టి తో చూస్తుంది. రాక్షసులను కూడా వారికి సమయం వచ్చినప్పుడు నిర్జించి తనలో కలుపుకుంటుంది. గ్రహదేవతల సంచారాన్ని నియంత్రణ చేస్తూ, ఇంద్రుడు, వరుణుడు, యముడు, చంద్రుడు, సూర్యుడు వారి పనులు సకాలంలో చక్కగా చేసేట్టు చూస్తూ, ఈ చరాచర జగత్తును రక్షిస్తూ వుంటుంది. 
"శ్రీమహారాజ్ఞి" - జగత్తును పోషించి, పాలిస్తుంది - సర్వసామర్థ్యమైన పరిపాలనా దక్షత కలది - అంతటా, అందరికీ శుభములను చేకూరుస్తుంది.
జగత్తుకు తల్లి అయిన "అమ్మ"ను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం శ్రీమహారాజ్ఞ్యై నమః అని చెప్పుకోవాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు