వైతాళికుడు! అక్షర యాత్రికుడు!:- డా పీవిఎల్ సుబ్బారావు. విజయనగరం.-94410 58797.
1.
కథ,కవిత ,నాటకం ,
త్రివేణి సంగమం ఆ కలం!

ఆ కలం అక్షరబలం ,
సమాజ సంస్కరణే ధ్యేయం!

ప్రభువుల కొలువులో ఉన్నా, ఆయన సదా ప్రజాపక్షం!

తోకచుక్క సంస్కరణపథ, కేతనం, శాస్త్రీయ దృక్పథం!

రచన వాడుక భాష, 
   ప్రతి అక్షరం ఎద ఘోష!

2..
తొలి కథ దిద్దుబాటు ,
జీవన సరి దిద్దుబాటు!

పెద్ద మసీదు మతం పై, వ్రాసి ఇచ్చిన పెద్ద రసీదు!

మీ పేరేమిటి హేతువాద, సునిశిత పరిశీలనం!

సంస్కర్త హృదయం, ఆశయం ఆచరణాల భేదం! 

వారి కథల బలం ,
అద్భుతంగా సాగే కథనం! 

3.
పూర్ణమ్మ కథ మన ఎద ,
కదిలించే, కరిగించే వ్యధ!

కన్యక నారీ శక్తికి ,
ఏనాటికి నాణ్యమైన ప్రతీక!

కాసులు స్త్రీ పురుషుల, మధ్య మోహం దాటిన ప్రేమ!

పెంచక పెరుగునే ప్రేమ ?ప్రేమని పెంచాలి!

మరులు మరలి,పోవును, ప్రేమ నిలిచి పోవును!

4.
దేశభక్తి కవిత ప్రతి అక్షరం,
 దేశప్రేమ విస్పోటనం!

దేశయశోస్తోత్ర మేమీ లేదు, ఉన్నది దేశాభ్యుదయ సూత్రం!

దేశాన మట్టిని కాదు మనిషిని, ప్రేమించాలి, తెరిపించు నేత్రం!

సర్వకాలాలకు ,సర్వదేశాలకు,
ఈ దేశభక్తి అమరం!

దేశభక్తి ఒక్కటిచాలు ఆయన్ని, మహాకవి అనగ కవితాలోకం!

5.
కన్యాశుల్కం నాటకం తెలుగు ,
సాహిత్యఆకాశ ధ్రువనక్షత్రం! 

శాసనం చేయని పని అది, చేసిందని ప్రజలే ప్రబలసాక్ష్యం!

సాహిత్యాంతం నాటకంధ్రువం, 
కన్యాశుల్కం అక్షర సౌధం!

గురజాడ తెలుగుభాషకిచ్చిన, వరం  ముత్యాలసరం!

వాడుక భాష ఉద్యమ, అగ్రనేత, గురజాడ,
 వేయి వెలుగుల వెన్నెల జాడ!
_________


కామెంట్‌లు