రాజు - దేముడు -డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు

  ఒకూర్లో ఒక పెద్ద చెరువుంది. ఒకసారి ఆ వూర్లో పెద్ద వానొచ్చి చెరువు నిండిపోయి గట్టు తెగింది. దాంతో నీళ్ళన్నీ వూర్లోకొచ్చి ఇండ్లూ వాకిళ్ళూ ఎక్కడివక్కడ కొట్టుకపోసాగినాయి. వెంటనే ఆ వూరి రాజు మనుషులను పిలిపిచ్చి ఆగమేఘాల మీద దానికి కట్ట కట్టిచ్చినాడు. కానీ తరువాత రోజు పొద్దున్నే వచ్చి చూస్తే రాత్రికి రాత్రి కట్టిన కట్ట మొత్తం కొట్టుకోనిపోయింది.ఎన్నిసార్లు కష్టపడి కట్ట కట్టినా మరుసటి రోజు పొద్దునకల్లా నున్నగా వూడ్చుకపోయేది. దేశదేశాల నుండి ఎంతో మంది వచ్చి రకరకాలుగా కట్టి చూసినారు. వూహు... ఏదీ నిలబల్లేదు. దాంతో రాజు ''ఎన్నిసార్లు కట్ట కట్టిచ్చినా నిలబడ్డం లేదు. దాని సంగతేందో పోయి ఆ దేవున్నే అడిగి కనుక్కోవాల'' అనుకోని దేవున్ని వెదుక్కుంటా బైలుదేరినాడు.
రాజు అట్లా పోతా వుంటే దారిలో ఒక మామిడిచెట్టు కనబడి ''రాజా!రాజా! యాడికి పోతా వున్నావు'' అనడిగింది. దానికా రాజు ''మా వూర్లో చెరువుకు ఎన్నిసార్లు కట్ట కట్టిచ్చినా పడిపోతా వుంది. ఎందుకో కనుక్కుందామని ఆ దేవుని దగ్గరకు పోతా వున్నా'' అని చెప్పినాడు. అప్పుడా మామిడిచెట్టు ''రాజా! రాజా! నేను ప్రతి ఎండాకాలం విరగబడి కాస్తావున్నా. నా కాయలు తియ్యగుంటాయి. బాగా లావుగుంటాయి. అయినా ఒక్క పక్షి గానీ, పశువు గానీ దాండ్లను ముట్టుకోడం లేదు. నా కాయలు ఎందుకు ఎవరూ తినకుంటున్నారో కొంచం కనుక్కోని రా'' అనింది. ''సరే'' అని రాజు ముందుకు కదిలినాడు.
అట్లా పోతా వుంటే దారిలో రెండావులు ఎదురొచ్చినాయి. అవి రాజును చూసి ''రాజా! రాజా! యాడికి పోతా వున్నావు'' అనడిగినాయి. దానికి రాజు ''మా వూర్లో చెరువుకు ఎన్నిసార్లు కట్ట కట్టిచ్చినా పడిపోతా వుంది. ఎందుకో కనుక్కుందామని ఆ దేవుని దగ్గరకు పోతా వున్నా'' అని చెప్పినాడు. అప్పుడా ఆవులు ''రాజా! రాజా! ఈ అడవిలో యాడ చూసినా మా మోకాలెత్తున గడ్డుంది. గిట్టల్దాకా నీళ్ళున్నాయి. కానీ వాటిని తినడానికీ లేదు, తాగడానికీ లేదు. మా మెడలెందుకు కిందకు వంగకుండా వున్నాయో కొంచం కనుక్కోని రా'' అన్నాయి. ''సరే'' అని రాజు ముందుకు కదిలినాడు.
అట్లా పోతా వుంటే దారిలో ఒక పందిపిల్ల కనబడి ''రాజా! రాజా! యాడికి పోతా వున్నావు'' అనడిగింది. దానికా రాజు ''మా వూర్లో చెరువుకు ఎన్నిసార్లు కట్ట కట్టిచ్చినా నిలబడ్డంలేదు. ఎందుకో కనుక్కుందామని ఆ దేవుని దగ్గరకు పోతా వున్నా'' అని చెప్పినాడు. దానికా పందిపిల్ల ''రాజా! రాజా! ఈ లోకంలో అందరూ బాగా అందంగా, ఆనందంగా వుంటే నేనెందుకిట్లా అసహ్యంగా వున్నాను. ఎవరి దగ్గరికీ పోడానికీ లేదు. ఇష్టమొచ్చిన చోట తిరగడానికీ లేదు. నేనెందుకిట్లా పందిపిల్లగా పుట్టినానో కొంచం కనుక్కోనిరా'' అని అడిగింది. రాజు ''సరే'' అని ముందుకు కదిలినాడు.
అట్లా అరవై రాత్రుళ్ళూ అరవై పగల్లూ, ఎండనకా వాననకా అడవిలో వెదుకుతా... వెదుకుతా... పోతా వుంటే అది చూసి జాలిపన్న దేవుడు వాని ముందు ప్రత్యక్షమై ''ఏం నాయనా! ఏంది నీ బాధ! ఎందుకిట్లా తిండి తినకా నిద్రపోకా నా కోసమని రాత్రీ పగలూ వెదుకులాడ్తా వున్నావ్‌'' అనడిగినాడు.
రాజు దేవున్ని చూస్తానే కాళ్ళ మీద పడి మొక్కుతా ''సామీ! సామీ ! నా రాజ్యంలోని ప్రజలందరికీ మేలు చేద్దామని చెరువుకు కట్ట కట్టిస్తా వుంటే అది ఎన్నిసార్లు కట్టిచ్చినా నిలబడ్డం లేదు. ఎందుకని'' అన్నాడు.
దేవుడు చిరునవ్వు నవ్వి ''రాజా! నువ్వు వూర్లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నావే గానీ నీ ఇంట్లో వాళ్ళను మాత్రం పట్టిచ్చుకోవడం లేదు. నీ కూతురు నీ దగ్గర పని చేసే ఒక పేదోని మీద మనసు పడి పెండ్లి చేస్కుంటానంటే నువ్వు వాన్ని కాదని, ఆమెకు ఇష్టం లేకపోయినా ఒక డబ్బున్నోనికిచ్చి పెండ్లి చేయాలనుకుంటా వున్నావ్‌. అందుకే నువ్వు వూరికి మేలు చేయాలనుకున్నా అది నిలబడ్డం లేదు. నీ కూతుర్ని ఆమె కోరుకున్న వానికిచ్చి పెండ్లి చేయి. అప్పుడు కట్ట నిలబడ్తాది'' అని చెప్పినాడు. ఆ తర్వాత రాజు మామిడి చెట్టు, ఆవులు, పందిపిల్ల గురించి కూడా అడిగి తెలుసుకున్నాడు.
రాజు తిరిగి రాజ్యానికి వస్తా వుంటే దారిలో పందిపిల్ల కనబడి ''రాజా! రాజా! నేనెందుకిట్లా పందిపిల్ల లెక్క పుట్టినానో కనుక్కోనొస్తివా'' అనడిగింది. దానికా రాజు ''నువ్వు ఇంతకు ముందు జన్మలో పెద్ద గయ్యాళివంట. నీ మొగుడు తనకున్నదాంట్లో అందరికీ దానం చేస్తా వుంటే, నువ్వు దానం చేయకపోగా నీ మొగున్ని నానాక తిట్లు తిట్టి సాధించే దానివంట. అందుకే ఈ జన్మలో నీ మొగుడు ఒక రాజ్యానికి రాజుగా పుడ్తే, నువ్వు పంది లెక్క పుట్టినావంట'' అని చెప్పినాడు.
రాజు తిరిగి రాజ్యానికి వస్తా వుంటే దారిలో ఆవులు రెండూ ఎదురొచ్చి ''రాజా! రాజా! ఈ అడవిలో మా మోకాలెత్తున గడ్డుంది. గిట్టల దాకా నీళ్ళున్నాయి. అయినా తినడానికీ లేదు. తాగడానికీ లేదు. ఎందుకో కనుక్కోనొస్తివా'' అనడిగినాయి. దానికి రాజు ''మీరిద్దరూ పోయిన జన్మలో, మీ ఇంట్లో వున్న పశువులకు మేత ఎయ్యక,నీళ్ళూ తాపక బాగా సతాయించి బాధపెట్టినారంట. అందుకే ఈ జన్మలో మీకు ఇట్లాగయ్యింది''అని చెప్పినాడు.
రాజు తిరిగి రాజ్యానికి వస్తా వుంటే దారిలో మామిడిచెట్టు కనబడి ''రాజా!రాజా! నేనెంత బాగా కాపు కాసినా నా కాయలు ఒక్క పక్షి గానీ, పశువు గానీ ముట్టుకోడం లేదు. ఎందుకో కనుక్కోనొస్తివా'' అనడిగింది. దానికా రాజు ''నీ కింద పెద్ద నిధి వుందంట. అది నీకు తెలిసినా ఎవరికీ చెప్పకుండా మట్టసంగా వూరుకున్నావు. డబ్బుండేది లేనోళ్ళకు సాయం చేయడానికీ, పంచడానికే గానీ ఇట్లా వూకే దాచిపెట్టుకోడానికి గాదు. నువ్వు నీ గురించి తప్ప ఇంకెవరి గురించీ ఆలోచించడం లేదు. కాబట్టి నీ దగ్గరికి కూడా ఎవరూ రావడం లేదు'' అని చెప్పినాడు.
అప్పుడా మామిడిచెట్టు ''రాజా! నాకింద పెద్దనిధి వున్నేది నిజమే. ఇన్ని రోజులు నేను తినకుండా ఇతరులను తిననియ్యకుండా మట్టసంగా వుండడం తప్పే. నువ్వు దీన్ని తవ్వి తీసుకోనిపోయి మీ రాజ్యంలో పేదలందరికీ పంచు'' అనింది. రాజు సరేనని వూరి నుండి మనుషులను పిలిపిచ్చి అది చెప్పిన చోట తవ్వి చూస్తే ఏడుబండ్ల రత్నాలు, ఏడుబండ్ల వజ్రాలు దొరికినాయి. రాజు అవన్నీ తీసుకోని వూరికి చేరుకున్నాడు.
వూర్లోకి పోగానే కూతుర్ని పిలిచి ''పాపా! నిన్ను బాధపెట్టినందుకు ఏమీ అనుకోవద్దు. నీ కెవరిష్టమో చెప్పు. వానితోనే నీ పెండ్లి జరిపిస్తా'' అని చెప్పినాడు. తర్వాత రోజే అంగరంగ వైభోగంగా కూతురికి నచ్చినోనితో పెండ్లి చేసినాడు. ఆ పెండ్లిలో పేదోళ్ళందరికీ మామిడిచెట్టు కింద దొరికిన నిధంతా పంచి పెట్టినాడు. దాంతో ఆనకట్ట నిలబడింది.
***********

కామెంట్‌లు