అక్షరాభిషేకం.:- డా పివిఎల్ మబ్బారావు,-విజయనగరం,-9441058797
1.
శంకరా!సర్వమంగళధరా! విశ్వశుభాంతరంగా!

 నా అహమణచంగ ,
శివోహం అని తెలియంగా!

నీవే దిక్కు కనంగ,
నా చిక్కు విడంగా!

నా హృదయ కైలాసాన, అవతరించ వేగంగా రావంగా!

 ఆర్తుడనై, అర్థుడనై,
 జిజ్ఞాసుడనై మరి  వేడంగా!

2.
శ్రీకాళహస్తీశ్వర శతకం, మనసారా పఠించగా! 

కుమార సంభవం.,
 అంతరార్థం తెలియగా! 

శ్రీనాధ కాశీఖండం. 
ఇక్షుఖండమై రుచించగా! 

శివ పురాణాలు గురువులై,
  తత్త్వబోధ కలిగించగా! 

శివకోటి క్రమం తప్పక,
నిత్యము వ్రాస్తూ బతకగా!
3.
యాబదిఆరు  అక్షరాలేల?
రెండే చాలు నేర్వంగా! 

శివ ,శివ అంటూ శవం, కాకముందే శివవశమవంగా!

"ఓం నమశ్శివాయ , అక్షరాభ్యాసం నాడు అనంగా! 

జీవితాంతం అదే అనుక్షణం, మననం చేయంగా! 

నిత్యము పంచాక్షరీ గంగా, తరంగాల మునకలేయంగా!
4.
నీవే నేను, నేనే నీవు,
మరి ఏమి ఇల లేదనంగా!

పాశములు క్లేశములు ,
తమకు తామే తొలగంగా!

భక్తినావలో భవసాగరం, అవలీల దాటంగా? 

ముక్తిబాటలో ముందు, చూపుతో జీవన్ముక్తి కలగంగా!

నరజన్మ ,మరుజన్మ లేక, పరమార్థం తెలిసి రావంగా! 
5.
క్షణం క్షణం నీ నిరీక్షణమే, 
అదే జీవితాన సరి శిక్షణ!

నీ తలపు తలుపు తెరిస్తే, అంతకన్నా ఏముంది గెలుపు! 

నీ మీద దృష్టి కేంద్రీకరిస్తే అదే,
జీవన పథాన  గొప్ప మలుపు!

నీవే ప్రియాతిప్రియం, 
లేదు భయం, బతుకు జయం! 

నీవే పథం, నీవే గమ్యం,
 అదే సత్తు ,అదే మోక్ష విత్తు! 
_________


కామెంట్‌లు