వారెన్ బఫెట్..: - - యామిజాల జగదీశ్
  చరిత్రలో మరే ఇతర కోటీశ్వరుడూ ఇవ్వనంతగా ఎక్కువ  విరాళాలిచ్చారు.
లక్షలాది మంది ఈ తొంభై అయిదేళ్ళ ధనికుడి పెట్టుబడి వ్యూహాలను ఇప్పటికీ అధ్యయనం చేస్తుంటారు. ఆయనలాగే ధనవంతులు కావాలని ఆశిస్తారు.
కానీ బఫెట్ నేర్పే పాఠాలు డబ్బుకు మించి ఉంటాయి.
తన జీవిత చరిత్ర "ది స్నోబాల్" లో ఆయన ఇలా అన్నారు :
“మీ స్నేహితులు, మీ భాగస్వామి, మీ సహోద్యోగులు కూడా మీ భవిష్యత్తును రూపొందించగలరు. వారు దయగలవారు. నిజాయితీపరులు. శ్రద్ధగలవారైతే, మీరు వారిలాగే మారతారు.
కానీ అలా కాదని వారి కోపాన్నీ లేదా విచారాన్ని ఆలోచిస్తూ ఉంటే, ఆ బాధ కూడా మిమ్మల్ని అనుసరిస్తుంది. కనుక మీ కంటే మంచి మనసున్న వ్యక్తులతో సమయం గడపడం ఎంతైనా మంచిది...." 
అయితే ఇది పెట్టుబడి సలహా కాదు. ఇది జీవిత సలహా.
1998లో, ఫ్లోరిడా విశ్వవిద్యాలయ  విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ ప్రశ్నను ఆయన అడిగారు.
“మీరు ఒక క్లాస్‌మేట్ భవిష్యత్తు విజయంలో 10 శాతం కొనగలిగితే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?” అన్నదే ఆ ప్రశ్న. దానికి ఆయనే ఇలా సమాధానమిచ్చారు....
అప్పుడాయన వారికి అత్యధిక ఐక్యు
IQ లేదా ఉత్తమ గ్రేడ్‌లు ఉన్న వ్యక్తిని ఎంచుకోవద్దని చెప్పారు. కానీ దయగల, నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే, స్థిరంగా ఉండే వ్యక్తిని ఎంచుకోమని ఆయన సూచించారు.
ఎందుకంటే తెలివితేటలు కాదు, క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వమే మీరు ఎంత దూరం వెళతారో నిర్ణయిస్తుందన్నారు వారెన్ బఫెట్.
చాలా మంది పెట్టుబడిదారులలా కాకుండా, బఫెట్ ఎప్పుడూ వాల్ స్ట్రీట్‌తోనే ముడిపడాలనుకోలేదు.
ఆయన నెబ్రాస్కాలోని ఒమాహాలో నివసించారు. నిశ్శబ్ద ప్రదేశం. అక్కడ ఆయన ముఖ్యమైన వాటిపట్ల దృష్టి పెట్టగలిగారు.
ఆయన ఇప్పటికీ 1958లో 31,500 డాలర్లకు కొన్న ఇంట్లోనే నివసిస్తున్నారు. నిరాడంబరమైన 2014 కాడిలాక్ XTS వాహనాన్నే నడుపుతున్నారు. తన తత్వశాస్త్రంలా తన జీవితాన్నీ సరళంగా ఉంచుకున్నారు.
బఫెట్ తన సంపదలో 99 శాతం దాతృత్వానికి విరాళంగా ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ మాటకు కట్టుబడే సాగుతున్నారు.
ఆయనకు, ఇతరులకు సహాయం చేసినప్పుడు మాత్రమే సంపదకు ఓ అర్థం ఉంటుందంటారు.
విజయం అనేది మీ ఇల్లు ఎంత పెద్దది, మీరెంత డబ్బు సంపాదిస్తున్నారు లేదా మీవద్ద ఏమేమున్నాయి అనేవి కావని ఆయన జీవితం మనకు గుర్తు చేస్తుంది. వినయం, ఉద్దేశ్యం, దాతృత్వం ఒకరి విజయవంతమైన జీవితానికి సంకేతాలు అని ఆయన జీవితం చెప్పే పాఠాలు. 
ఆయన జీవితం కేవలం ఆర్థిక సంపదతో ముడిపడింది కాదు. ఆయన తన జీవిత గమనంలో దయ, ఓర్పు, సమగ్రత యొక్క వారసత్వాన్ని అనుసరించారు. ఆచరణలో చేసి చూపించారు.

కామెంట్‌లు