సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -43:- అన్నదమ్ముల పొత్తు చిన్నప్పుడు -అక్క చెల్లెల్ల పొత్తు పెద్దప్పుడు
****
వోమ్మో!ఓఅవ్వో! ఏం పగలు,ఏం పంచాతులే అవ్వా! కయ్యానికి కాలు దువ్వుకుంట సావులు సాపెన్లు బెట్టుకుంటుంటె ఇన్లేక సత్తున్నం!రామలచ్చన్లొతికె ఉండాల్సినోళ్ళు ఆలి సుగిరీవునొతికె సావులు కోరుకుంటుండ్రు.గీళ్ళు ఒక్కతల్లి కడుపున పుట్టినోల్లొతికె లేరవ్వా!రావ రావణులొతికె ఉండ్రు."
"ఎవలే శెల్లే! గా మల్లయ్య మారెయ్య లేనా?ఆత్తి కాడ్నేనా గింత పంచాతి?
అవుమల్ల!గాల్లే అవ్వా ! శెల్లెండ్లిద్దరు అన్నల కాళ్ళు గడ్డం పట్టుకొని ఎంత బతిలాడినా సెవున బెట్టట్లె. శిన్నోడు సదువు సందె లేనోడు ఎవుసాయం జేస్కొని బతుక్కుంట ముసలోల్లని సూస్కుంటడని ఓ అరెకరం ఆని పేరు మీద రాశిండని,గాదాన్ని మల్ల శెరిసకం చేత్తవా చెయ్యవాని పెద్దోడు పంచాతి కొచ్చిండు.తన సద్వుకు తమ్ముడు,అయ్య ఎంత పెట్టుబడి పెట్టింది,ఎంత కట్టపడింది మర్సిండు. వొచ్చిన కానించి గా ముసలోల్లని వజ పుచ్చుకుంటుండవ్వా!
గాళ్ళు శిన్నప్పుడు ఎట్లుండె.ఒకల మీద ఒకలు ఈగ ఆలనీయకుండ, ఒక్కటే కుత్కెతో రామ లచ్చనులొతికె ఉండెటోళ్ళు.గిప్పుడు గాళ్ళని సూత్తుంటే ఈళ్ళేనా అనిపిస్తుంది అవ్వా!
అవునే శెల్లె! గాళ్ళు నల్గురు మా కళ్ళ ముందు పెరిగినోల్లె. మల్లయ్య,మారెయ్యలని సూసి ఉంటె గట్లుండాలి. గా ఆడ పొల్లగాండ్లయితె ముదాము పూల కాడ,మైదాక్కాడ  పంచాతి పెట్టుకునే టోళ్ళు. గీ ఆడపొల్లగాల్లా! ఆడిదయ్యాల అన్నట్టుండేది.గాళ్ళేమో గిప్పుడు ఒకలికొకలు పానంగ ఉంటుర్రు. గీళ్ళెమొ "ఒకలి సావు ఒకరు కోరుకుంటుండ్రన్న మాట."
అందుకేనే  శెల్లె! "అన్నదమ్ముల పొత్తు శిన్నప్పుడు -అక్క శెల్లెల్ల పొత్తు పెద్దప్పుడు" అని ఊకెనె అన్లె.గాదాన్ని  గీళ్ళు నిజం చేత్తుండ్రు గదె. ఏం మడుసులో ఏమో! సచ్చిన్నాడు గిదంత కట్కపోతారట్న."
"గాళ్ళ శెల్లెండ్లిద్దరు జూడు. లగ్గమై సక్కంగ కాపురాలు సేస్కుంట, ఎంత ముద్దుగ ఒకలికొకలు పానం బెట్టుకుంటుండ్రో! గాళ్ళని జూసైన బుద్ధి రావట్లేదానె.
గదేదో అంటరు సూడవ్వా?తీవుర వాదులు,ఉగ్గర వాదుల్లెక్క తయారైండ్రు.గాళ్ళని సిన్నప్పట్నించి జూసిందాన్వి.నువ్వు సెప్తె ఏమైన యింటరేమో రేపు పొద్దుగాల గాళ్ళ గా నల్గుర్ని పిల్సుకొత్త.నువ్వే గడ్డి పెట్టాలె"అన్కుంట బోయింది గాళ్ళ పెద్దవ్వ.
"ఒక్క రకతం పంచుకుని పుట్టినోళ్ళు.ఎట్టుండాలె.గిట్ల తన్నుకొని అమ్మ నాయిన కడ్పుల సిచ్చుబెడ్తున్నరు. పైసలు,బూవులు ఉంటయ్.పోతయ్ .పంచాతులు పెట్కొని ఏం సొదిత్తరు.పానాల్ దీస్కుంటె వత్తయా!" గాళ్ళకి ఎట్ల జెప్తె సమజైతది?" ఆలోచన్ల బడింది అవ్వ.
గదండీ సంగతి! "అన్నదమ్ముల పొత్తు శిన్నప్పుడు -అక్క శెల్లెల్ల పొత్తు పెద్దప్పుడు" అంటే గిదే మరి. అన్నదమ్ముల మద్దెన శిన్నప్పటి ప్రేమలు పెద్దయినంక ఉండవ్.శత్రువుల్లెక్క బత్కుతరు.ఇంగ ఆడపిల్లలైతే  శిన్నప్పుడు కొట్కొని ,తిట్టుకున్నా పెద్దయినంక ఒక్క పానం లెక్క బత్కుతరు, కష్టాల్లో నా శెల్లె,నా అక్క అని ఆదుకుంటరు.
కామెంట్‌లు