మాయమైపోతున్నాడమ్మా..‌.;- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-\అత్తాపూర్ హైదరాబాద్

(ఆశుకవి అందెశ్రీ గారికి అక్షర నివాళి)

మాయమైపోతున్నాడమ్మా…
మనిషన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు
మానవత్వం ఉన్నవాడు…

పశువులమందలో దూరి మనిషి పశువైపోతున్నాడమ్మా...మానవత్వం 
మంటగలిపి...మానవమృగంగా 
మారిపోతున్నాడమ్మా…మనిషన్నవాడు

తన నీడకే తాను భయపడుతూ
పాపాల భైరవుడిలా పారిపోతున్నాడమ్మా
స్వార్థమనే ఊబిలో మునిగిపోతూ… దిగజారిపోతున్నాడమ్మా...మనిషన్నవాడు

గాడితప్పి గబ్బిలంలా
గాఢాంధకారంలో తిరుగుతూ
పాలు త్రాగి పాములా పచ్చివిషం గ్రక్కుతున్నాడమ్మా...మనిషన్నవాడు...

కళ్లకు పొరలు కమ్మి
అంధుడై... కామాంధుడై...  
కోర్కెల అగ్నిలో దగ్ధమై బూడిదగా
మారిపోతున్నాడమ్మా...మనిషన్నవాడు

చెట్టు నుండి రాలిన ఆకులా
ఆశల ఆవిరై నీటి బుడగలా 
పేలిపోతున్నాడమ్మా...మనిషన్నవాడు

మానవతను బంధించే 
బంధాలు అరిగి...త్యాగం తరిగి...
ప్రేమ కరిగి...పాశాణహృదయుడిగా మారిపోతున్నాడమ్మా...మనిషన్నవాడు

ధనదాహంతో 
అధికార గర్వంతో
విర్రవీగుతూ విషసర్పంలా 
విషం చిమ్ముతున్నాడమ్మా...
నూటికో కోటికో ఒక్కడుంటాడేమో...
మానవత్వమున్నవాడు…కానీ 
వెయ్యి కళ్లతో వెతికినా వాడి 
జాడైనా నీడైనా కనబడలేదని...

వెతుకుతూ వెతుకుతూ 
వెళ్ళిపోయాడమ్మా...
మానవత్వం కోసం... 
మానవహృదయాల్లో
"అక్షర దీపాలు" వెలిగించిన 
"కాంతి పురుషుడు..? ఆశుకవి...
"లోకకవి...అమరజీవి డా. అందేశ్రీ గారు
"వారికిదే నా అక్షర అశ్రునీరాజనం...

కామెంట్‌లు