సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -47: అందం కోసం పెట్టిన సొమ్ము- ఆపదకి పనికొచ్చినట్టు
****
ఇంగ జూశినవార అయ్యా!  మీ నాయిన ఎట్లంటుండో? నన్ను బట్కొని నీకిప్పుడు సోకులు గావల్సొచ్చినాయి!  బంగారు నగల్లేక పోతే నీ మెడకాయ ఏం చిన్నబోదు తీ! దొంగలొస్తరు. దొరలొస్తరు. గవి జూసి బజార్న బోతుంటే ఎవడో ఒకడు గొంతుకాయ బిస్కి దీస్కుంటడని ఏదేదో  అన్నడు గద! గిప్పుడేమంటడో అడగర అయ్యా!"
"అశెలే. ఇంగేం వద్దిస్తవ్ తీ!"
ఉన్నమాట అనేతల్కి ఎట్ల ఉల్కిపడుతుండో జూడరా అయ్యా! పోయినేడాది పంట డబ్బులు చేతికొత్తె. ఓ తులం బంగారం కొందామయ్యా అంటే అయ్య కొడుకు పడనిచ్చినారు. గిప్పుడు జూడురి ఎంత పిరమైందో! గది సుత ఉంటె ఎంత మంచిగుండేది.వాడెవడో మూడ్రూపయిల మిత్తి ఇత్తనన్నడని ఇచ్చిండ్రు. ఆయనవుసరానికి మనమిచ్చినం.గిప్పుడు మనవుసరానికి గాయన సుత ఇయ్యాలె గద. ఎంత ముడిమాల బెడుతున్నడో సూత్తనే ఉన్నం గద.
గందుకనే పెండ్లిల్లప్పుడు ఆడువిల్లకి  ఒంటిమీద బాల తొడుగని బంగారం బెడ్తరు. కట్నం ఇచ్చేది ఇత్తున్నం.ఇంగ పిల్లకేం బెడ్తరని గట్టిగ అడ్గుడు గిందుకే.గట్లనే లగ్గం అయినంక మొదటి రాత్రి పెండ్లి కూతురు కొంగున పెండ్లి కొడుకుతో బంగారం గట్టిస్తరు.మల్ల దాన్ని ఎప్పుడు అడగరు. గిదంత ఎందుకు సోజ్జెప్తుంది అనుకోకుండ్రి. గిట్ల ఏ ఆపదకో,అవసరానికో అక్కెర కొత్తదని".
"అందం కోసరం గొన్నా, ఆనందం కోసరం గొన్నా గవన్ని బెట్టుకొని దినాం ఊరేగుతమా ఏంది? గీ మొగోళ్ళకి ఎప్పుడు సమజైద్దో ఏమో? గీ ఆడోళ్ళకేం పన్లేదు.బంగారమనంగనే మస్తు కాయుషు పడ్తుంటరు. ఎన్కబడి కొనేదంక ఉడుంపట్టు బడ్తరని నిందలేత్తరు."
 "అవ్వ సణుగుడు తాత, నాయిన, ఏం మాట్లాడకుండ నోరెత్తకుండ తలకాయలు ఒంచుకొనుడు"..గవన్ని జూస్కుంట 'గీ మొగోళ్ళు' అనే మాట ఇనేతల్కి బుడ్డోడు అవ్వ తానకి పిల్లొతికె నడ్సుకుంట బోయిండు.
"గాన్ని జూసి ఏందిరా బుడ్డోడా? ఏం గావాలె.నువ్వు సుత గా తాన్ల ముక్కవే నైతివి.పెద్దయినంక గట్లనే తయారైతవా ఏంది? అనంగనే...
"అవ్వా!గీ మొగోడు చాన మంచోడు.నువ్వెట్ల జెప్తె గట్లనే ఇంటడు.నీ మీదొట్టు. మనం ఇయ్యాల్నె పేటకు బోదం పా .గప్పుడు నీ ఎంటొచ్చినప్పుడు జూసిన.గక్కడ  కొట్లె బోలెడు సొమ్ములున్నయి. నీకిట్టమైనవి దీస్కో! అంటుంటే..."
గప్పటి దాక శికాకు శికాకుగ ఉన్న అవ్వ మన్మడి మాటలకు మనసు తేలికై నవ్వుకుంట "నువ్వొక్కడివేరా! గీ అవ్వ బాధని అర్తం జేసుకున్నది".అంటుంటే...బుడ్డోడు అంగి కాలరెగరేస్కుంట తాత,నాయినొంక జూస్తుంటె ఆళ్ళు సుత నవ్వుకుంట "నువ్వు మామూలోడివి గాదురోయ్!" అన్కున్నరు.
గదండీ సంగతి! "అందం కోసం పెట్టిన సొమ్ము- ఆపదకి పనికొచ్చినట్టు" అంటే గిదే.అందం అంటే ఇక్కడ అలంకరణ కోసం అని అర్థం చేసుకోవాలి. అలాగే ఆపద అంటే ఏదైనా ఆర్థిక సంబంధమైన కష్టం,అత్యవసరం అని అర్థం.
కామెంట్‌లు