అన్నా అన్నా…
ఓ ఎర్రన్నా..! యాడి కెళ్తివే…
ఈ అడవి బిడ్డల్ని అనాధల్ని చేసి..!
నిన్ను కుట్టామనీ…
మట్టు పెట్టామనీ…
యముడికి బాట
చూపించామని...
ఎర్ర జెర్రిపోతులెన్నో
గాల్లో ఎగిరెగిరి పడుతున్నాయే…!
నేడు మట్టిలో కలిసిన నీవేళ్లు
రేపు అంకురాలై పైకి లేస్తాయని…!
నీవు బిగించిన ఆ పిడికిళ్లు
రేపు ఎగిరే ఎర్రజండాలై
రెపరెపలాడుతాయని…!
గర్జించే నీ కంఠం...
రేపు శంఖారావమౌతుందని…
కారం నూరే నీకళ్లు రేపు మెరుపులై
కారుచీకటిలో కాగడాలౌతాయని…!
నేడు నేలరాలిన నీ రక్తపు చుక్కలు
రేపు పొడిచే తొలి పొద్దులౌతాయని…!
అణగద్రొక్కబడిన అడవి కొడవళ్ళే
రేపు పిడుగుల్లా విరుచుకుపడతాయని…!
నేడు పులుల ముసుగులో తిరిగే
జిత్తులమారి గుంటనక్కల్ని...రేపు
జింకల గుంపు వేటాడుతుందని…!
పిలవని అతిథుల్లా వచ్చి
పిండాలకోసం కావుకావుమని అరిచే
ఈ పిల్ల కాకులకేం తెలుసే ఎర్రన్నా…?
మీరు మా గుండెల్లో చెక్కిన
ఎర్రాక్షరాల్లో...
ఏ కొండకొడవళ్ళు...
ఏ గండ్ర గొడ్డళ్ళు...
ఏ పిడిబాకులు...
ఏ పిడుగులు...
ఏ బాణాలు...
ఎన్ని దాగున్నాయో..?
రణభేరి ఎప్పుడు
గణగణమని మ్రోగుతుందో…?
ఈ నల్లకాకులకేం తెల్సే ఎర్రన్నా..!
అన్నా అన్నా…ఓ ఎర్రన్నా..!
యాడి కెళ్తివే…యాడి కెళ్తివే…
ఈ అడవి బిడ్డల్ని అనాధల్ని చేసి…
జోహార్ జోహార్..! ఎర్రన్న అమర్ రహే..!
( మొన్న అమరుడైన అడివి బిడ్డ
యాదిలో ఓ కన్నీటి కవిత...
వారి ఆత్మకు శాంతి కలుగునుగాక...)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి