చదివే పుస్తకమే జీవితం..!
గడిచే జీవితమే పుస్తకం..!
కొత్త పుస్తకం...
నవయవ్వన సుగంధం...
సెల్ఫ్‌లో బూజుపట్టిన పుస్తకం...
వృద్ధాప్యపు నిర్వేదం నిశ్శబ్దం..!
పుస్తకంలో తిరిగే ప్రతి పేజీ...
జీవితంలో గడిచే ప్రతి రోజు..!
నీ జీవిత పుస్తకానికి రచయిత
డిజైన్ చేసి ముద్రణ చేసేది ఆ విధాత...
చదివేది...సమాజం సువిశాల ప్రపంచం..!
నీ జీవిత సౌధానికి నీవే శిల్పి...
జన్మనిచ్చేది... నీ తల్లిదండ్రులు...
జీవం పోసేది...పైనున్న ఆ పరమాత్మ...
జ్ఞాన దీపం వెలిగించేది...
నీ గురువులు...నీ ప్రాణస్నేహితులు..!
నీ జీవిత పుస్తకం నవరస భరితం...
ఒక పేజీలో నవ్వు...
ఒక పేజీలో కన్నీరు...
ఒక పేజీలో విజయ గీతం...
మరో పేజీలో ఓటమి భయం..!
నీ జీవితంలో
ఒక రోజులో
సూర్యోదయంలా
అంతులేని ఆనందం...
పట్టరాని సంతోషం...
మరో రోజులో
సూర్యాస్తమయంలా
నిట్టూర్పులు...నిరాశ...నిస్పృహలు...
ప్రతి ఉదయాన్ని ఒక కొత్త పేజీగా లిఖించడమే...నీ ప్రతిభ...నీ ప్రజ్ఞ..!
సంసార స్రవంతిలో...
సమస్యల సుడిగుండాలు
సుడులు తిరిగే వేళ...
మృత్యువు తలుపు తట్టే వేళ...
ముళ్ళకంచెలతో బంధించిన వేళ...
ఊపిరాడని కష్టాలవర్షం కురిపించే వేళ...
నీకు తోడెవరు...?
కనిపించని ఆ పరమాత్మే.!
నీ హృదయాన వెలిగించే దీపమే నీ ఆశ.!
నీ ఆత్మలో ఉప్పొంగే ఉల్లాసమే నీ మార్గం!
నీ ధైర్యమే నీకు దిక్సూచి...
నీ ఆత్మవిశ్వాసమే నీకు కవచం..!
విధి విషంచిమ్మినా...నవ్వే నీ ధీరత్వమే
నీ జీవన శాస్త్రం...నీ విజయసూత్రం..!
నిన్ను నకష్టాల కడలిని దాటించేది...
నీ ఉత్సాహపు పడవే..! కానీ ఆదుకునే
దిక్కెవరులేక చిక్కుల్లో నీవు చిక్కిన వేళ
నీ మనసే నీకు మార్గదర్శి...మంత్రదండం
నీ సంకల్పమే నీవిజయానికి సింహద్వారం
✨

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి