గౌడన్నకు నివాళి!!:-డా ప్రతాప్ కౌటిళ్యా.
ఆకాశమంత ఎత్తున 
తలెత్తుకున్న తాటి చెట్టు 
మీ తాత ముత్తాతలు ఆస్తి 
తెల్లని ముత్యాలు రాల్చి 
మత్తు నిధులిచ్చీ దేవుని నైవేద్యంతో 
ఊరంతా పండగ చేసి 
దేవుడి ముందు నిన్ను గరుడ స్తంభం చేసి 
నిలబెట్టిన ఆ చెట్టు 
నీ చుట్టం మాత్రమే కాదు జనం ప్రాణం కూడా!!

తలంటు స్నానం చేసి 
విరబూసిన వెంట్రుకల్లా పచ్చని ఆకులతో 
నింగిన విరిసిన ఈత చెట్టు 
పాత కాలపు పడతిలా 
తెల్లని పాలను కార్చీ పసిపాప లాంటి 
పల్లె ప్రజల కడుపు నింపి 
మెదళ్లలో మెరుపై మెరిసిన 
తెల్ల బంగారం ఈత కల్లు కాదా!!
ఇప్పుడు 
దాని కళ్ళన్నీ నీ మీదే 
కళ్ళు తెరువు నారాయణ 
ఆ చెట్టు గోడు విను గౌడన్న!

కోట్లకు పడగెత్తిన కొబ్బరి చెట్టు 
కొబ్బరి నీళ్లనే కాదు 
కొబ్బరి కల్లును ఇచ్చి 
పల్లె  పట్నాన్ని ఓ పట్టు పట్టి 
ఇల్లు ఇల్లు చేరింది 
నీతో చేయి చేయి కలిపింది 
మేలుకో నారాయణ 
పదిమంది పలుకు పలుకులో నీ పేరు గౌడన్నా!!

పాలెం నారాయణ గౌడ్ అన్నకు నివాళి.

కామెంట్‌లు