ఓ మిత్రమా…
నా ప్రియ నేస్తమా…
ముళ్ళతో నిండిన మార్గాన్నీ
మల్లెలా మోసే సహనమే నీ సొత్తు…
చీకటిలోనూ నక్షత్రంలా
దారి చూపించే ధైర్యమే నీ వెలుగు…
ఓ మిత్రమా…
నా ప్రియ నేస్తమా…నీకు తెలుసు
నీ ముందర జీవితం
విందుభోజనం కాదని…
తుఫానులో నిలిచిన
చిన్న దీపశిఖ కాదని…
నీ అంతరంగ జలధిలో
ఎగిసిపడే ఆశల అలలున్నాయ్…
కారుమబ్బుల్లో కలిసిపోయే
మధుర స్వప్నాల వెలుగులున్నాయ్…
రేపటిని రెక్కలతో రాయాలనుకునే
నిశ్శబ్దపు ఊహలున్నాయ్…
ఓ మిత్రమా…
నా ప్రియ నేస్తమా…నీకు తెలుసు
నీ ముళ్లదారి మొత్తం
చెరగని రక్తపు మరకలేనని…
నీ పాదాల ప్రతిఅంచులో
మానని మౌన గాయాల
మంటలున్నాయని…
నీ కళ్లలో ఆగని
కన్నీటి ధారలున్నాయని…
నీ చుట్టూ ప్రవహించేది
సమస్యల సెలయేరులేనని…
అయినా…అయినా…
ఓ మిత్రమా…నా ప్రియ నేస్తమా…
నీ తపన...నీ త్యాగం ఒక్కటే...
నీ లక్ష్యం...నీ గమ్యం ఒక్కటే...
నీ ఆరాటం...నీ పోరాటం ఒక్కటే...
గరుత్మంతుడిలా గాలిని
జయించి ఎవరెస్టు శిఖరం చేరడమే…
విజేతగా…విశ్వ విజేతగా నిలవడమే…
అందని ఆకాశపు అంచుల్ని తాకడమే…
అనంతమైన అంతరిక్షాన్ని అణ్వేషించి
నీ అడుగుజాడల నీడల్ని ముద్రించడమే…
శక్తిపరుడు...యుక్తిపరుడు...
మానవుడే మహనీయుడంటూ...
మనుషుల్లో మణిదీపంగా మారడమే…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి