సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము- షష్టమాశ్వాసము-* 36వ రోజు
భీముని ఉత్సాహము చూసి ధర్మరాజు కలతపడుట
అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో " అమ్మా భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం ఔతున్నట్లుంది. తనంత తానే వెళుతున్నాడా లేక నీవు పంపుతున్నావా " అని అడిగాడు. కుంతీ దేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది " అమ్మా ! పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలి ఇస్తావా ? నీకు మతి భ్రమించిందా భీముడు విడువ తగిన వాడా? " అన్నాడు. కుంతీదేవి " నాయనా ధర్మరాజా ! కలత చెంద వలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన పదవ రోజునే ఒక బండ రాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసుని చంపి ఈ ఆగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను. ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెళతాడు. సాటి క్షత్రియుని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యుని శూద్రుని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మనధర్మం " అని చెప్పింది.
బకాసుర వధ
ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్ధాలతో నింపారు. భీముడు ఆ బండిని తోలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుని పిలువసాగాడు. అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తానే భుజించ సాగాడు. ఆహారం ఎంతకీ దగ్గరకు రాక పోయేసరికి బకాసురుదు ఆకలితో మండి పడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుని చూసి పిడి గుద్దులు గుద్దాడు. భీమసేనునికి చీమ కుట్టినట్లైనా లేక పోవడంతో ఉక్రోష పడి పక్కనే ఉన్న చెట్టును పెరికి భీమునితో కలియబడ్డాడు. భీముడు బకాసురునితో ఘోర యుద్ధం చేసి అతడిని చంపాడు. బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు. భీముని వారిని చూసి ఆ ఊరు వదిలి వెళ్ళక పోతే మీకూ ఇదే గతి పడుతుందని అరిచాడు. వారు భయపడి పారిపోయారు. బకాసురుని కళేబరాన్ని ఊరి పొలిమేరలో పడవేసాడు. ఏక చక్రపుర ప్రజలు భీముని పరాక్రమాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీ దేవికి చెప్పాడు. ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని మంత్రసిద్ధి కలవాడని అతనిని చూడటానికి తరలి వచ్చారు.
ఆది పర్వము- షష్టమాశ్వాసము సమాప్తం

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు