ఓ కవీ!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పువ్వులను పరికించు -
పలకరించి పరవశపరుస్తాయి,
ప్రోత్సహించి కలమునుపట్టిస్తాయి.

చిరునవ్వులను తిలకించు -
మోములపైకెక్కి వెలుగులు చిమ్ముతాయి,
పుటలపైకెక్కి పులకరింపజేస్తాయి.

సుగంధాల చెంతకు వెళ్ళు -
గుప్పుగుప్పుమని కప్పేస్తాయి,
రయ్యిరయ్యిమని రచనలుచేయిస్తాయి.

ప్రేమను చిరుగాలిగా మార్చు -
దూరమైనా దగ్గరకొచ్చి చుట్టేస్తాయి,
హృదినిపట్టేసి ఆటలాడిస్తాయి.

మాటలను గాలినిచేసి ఆకాశానికి పంపు -
మేఘమై పైన చినుకులు కురిపిస్తాయి,
అమృతమై మాధుర్యలను అధరాలకందిస్తాయి.

వలపును అణచివెయ్యకు -
రహస్యంగా ప్రక్కను జీవిస్తుంది,
వెంటబడి వేధనలకు గురిచేస్తుంది.

ఆలోచనలను అంతముచేయకు -
అనుసరించి మహిమను చూపిస్తాయి,
అంతరంగంలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

భావాలను తెంచివేయకు -
చిగురించి మారాకు తొడుగుతాయి,
ఫలించి లాభాలను అందిస్తాయి.

మనసును మభ్యపరచి మూసేయకు -
మౌనంగా పలుకులు వినిపిస్తుంది,
రమ్యంగా రసాస్వాదన చేయిస్తుంది.

కవితలను పఠించు ఆలకించు -
చెవులను చేరి శ్రావ్యత కలిగిస్తాయి,
గుండెలను చేరి ఘనతను చాటుతాయి.


కామెంట్‌లు