సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు

 సామెత -62-"అత్తా నీ కొంగు తొల్గిందన్నా తప్పే/ లేదన్నా తప్పే"
****
"గిదేందవ్వా?గిట్లుంటదా? మొన్న ఐతారం పెద్దక్క కొడుక్కి లగ్గమంటే ఎల్లిన గద. గక్కడికి అమ్మ శిన్నమ్మ కొడ్కు సుత వొచ్చిండు.గిన్నేండ్లకి అగుపించిండని సంబురంగ మందలిద్దమని తన తానకెళ్ళిన.
" మావా! ఎట్లున్నవే? శాన్నాల్లయింది నిన్ను సూడక. పెయ్యి బాగుందా? "అడ్గిన  గంతే అవ్వా! ఒంటి కాలిమీద లేషి గయ్యి గయ్యిమన్కుంట"బావుండ బట్కే వొచ్చిన.పెయ్యి బాగ లేకపోతే ఎట్లొత్తననుకున్నవ్? పెయ్యి బావుండాలన్కొన్నవా? బావుండొద్దనుకున్నవా?ఏమని యిశారిత్తున్నవేంది? గిట్ల పొట్టు పొట్టు ఆన గుర్సినట్టు అన్నడు." 
గా మావ మాటల్కి మస్తు దుఃఖమొచ్చిందవ్వా!నేనేమన్నని గంత పొట్టు పొట్టు దిట్టిండు!శీ !శీ! గిస్మంటోన్నెందుకు మందలిచ్చిన్నా అన్కున్నవ్వా!"
 అంతేలే శెల్లె! ఇంకో త్యేప ఎక్కడన్న కనిపిత్తే  సూడనట్టే వుండు.గప్పుడే మీ మావ తిక్క తిరుగుద్ది."
"ఓ అవ్వా! తిక్క తిరుగుడెక్కడిది.మల్ల గాయన్తో  తిట్లు తినాల్సొచ్చింది."
 "మల్లగిట్ల గాయన జోలికి పొయినవా ఏంది? అప్పుడు తిట్టినయ్ దుల్పుకొని మందలిచ్చినవా ఏందీ?"
"గదేం లేదవ్వా! మొన్న  పెద్దమ్మింట్లె దావత్ ఉందని ఎల్లిన గద.గక్కడికి మావ సుత వొచ్చిండు.గీయన నోరసలే మంచిది కాదన్కొని ఎదుర్వడకుండ సాటు సాటున తిర్గబట్టిన.గజ్జూసి  ఏందే కోడలా? కడలు కడలు తిర్గుతున్నవ్?శెట్టంత మణిషిని.మేనమావని.మందలిచ్చాలన్న కూసింత ఇంగితం సుత లేదా? గిట్లనే ఉంటదా? ఏం మణుషులో ఏమో?మంచీ మరియాద లేకుండయ్యిండ్రు. అన్కుంట ముక్క దొబ్బులు పెట్టిండవ్వా? గీనేం మణిషవ్వా!ఆపాచ్ఛనతో మందలిత్తె గట్లన్నడు.ఎందుకొచ్చిన గోలని మందలిచ్చకుండుంటె గిట్ల మాట్లాడిండు."
గందుకే మన పెద్దోళ్ళు  ఓ సామెతంటరు శెల్లె! "అత్తా నీ కొంగు తొల్గిందన్నా తప్పే/ లేదన్నా తప్పే" అని.
"భలే జెప్పినవ్ అవ్వా! గా సామెతేందో ఇడమర్సి సెప్పరాదు.
ఓ అత్త కెప్పుడూ కోడలి మీద ఏదో ఒక తప్పు దియ్యాలని  ఉండేది.పాపం గా కోడలికేమో అత్త మెప్పాశారం పొందాలని ఆరాట పడేది.
ఓ సారి సుట్టుపక్కల అమ్మలక్కలంతా ఓ సోట గూడిండ్రు.గాళ్ళకి ఏదో యిసయం ఆగకుండ సెప్పడం మొదల్వెట్టింది.గా సందట్ల  తన పెయ్యి మీద కొంగు తొల్గింది. గా ద్యాస లేకుండ సెప్పుట్ల మున్గిపోయిన అత్తని జూసి అయ్యో! ఎవలేమన్కుంటరో ఏమో! గట్ల తొల్గి పాయె అని అత్తొంక కల్లల్ల కల్లుబెట్టి సూసుడే గాదు సైగల్ సుత చెయ్యబట్టింది. గవ్వన్నీ పట్టించుకోకుండా గట్లనే సెప్తున్న అత్తని జూసి ఆగలేకపోయింది.నెమ్మదిగ అత్తకాడికెల్లి కొంగు సవరిచ్చి పొయ్యింది.
ఇంగ జూస్కో! అమ్మలక్కలంతా ఎల్లపోయినంక కోడలు తానకెల్లి "నీకు ఇంకే జ్యాస లేదా? నా కొంగునే సూడబట్టినవు.సైగ జెయ్యబట్టినవు. పైంగ ఎంత దైర్నం.వొచ్చి కొంగు సవరిత్తావ్!" అని చెడామడా తిట్టేతల్కి గా కోడలు తెల్లబోయింది.
ఎందుకొచ్చిన లొల్లి. ఇంగ అత్త జోలికి పోవద్దు అన్కుంది. గట్ల ఉండుకుంట వత్తుండగ ఓ దినాం ఇంటికి ఎవలో సుట్ట పక్కాలు,గందులో మొగోళ్ళు సుత చానా మందిరే వొచ్చిండ్రు. గాళ్ళందర్తో ముచ్చటి వెడ్తుంటె ఎన్కటి లెక్క కొంగు తొల్గింది. అత్తా నీ కొంగు తొల్గిందని సెబ్దామన్కొని , సెప్తే లేనిపోని లొల్లి అన్కుంట సెప్పకుండ కూసుంది.
 గట్ల అందర్తో మాట్లాడి గాల్లను గల్మదాక పంపేటప్పుడు కొంగు తొల్గింది సూసుకొని అయ్యో! అని గబగబా సర్తుకుంది.
ఇంగ గాళ్ళంత ఎల్లినంక కోడల్ని పిల్సింది."గట్ల కొంగు తొల్గితే సెప్పొద్దా? గాళ్ళ ముందు నా పర్వు బాయె. ఏం కోడల్వే నువ్వు" అని తిట్టిన తిట్టు తిట్టకుండ తిట్టింది. ఇంగ గా కోడలింక శాన్నాళ్ళ దనుక తేరుకో లేదు. అత్త మనసేంటో అర్తం కాక జుట్టు పీక్కుందన్కో.. గది శెల్లే!" అత్తా నీ కొంగు తొల్గిందన్నా తప్పే/ లేదన్నా తప్పే " అంటే గిదే మరి.
గదండీ సంగతి!" "అత్తా నీ కొంగు తొల్గిందన్నా తప్పే లేదన్నా తప్పే" అంటే. కొందరికి కొందరంటే అస్సలు ఇష్టముండదు. ఇష్టపడరు.గాళ్ళు ఏజ్జేసినా తప్పే అనిపిస్తది. ఇంగ గా ఎదుటి వ్యక్తి మీద నిందలు ఏయడాన్కి , తప్పులు తొయ్యడాన్కి ఎన్కాడరు.గందుకే గీ సామెత పుట్టుకొచ్చింది."

కామెంట్‌లు