అల్లరి చిల్లర బృందంతో కలసి ఆటలు ఆడటం, చదువును పూర్తిగా పక్కన పెట్టడం రాజు నిత్యకృత్యం. దానికి తోడు చెడు ప్రవర్తనను స్నేహితుల నుంచి నేర్చుకుంటున్నాడు. రాజు చెల్లెలు సిరి చాలా తెలివైన అమ్మాయి. ఎప్పుడూ తన తరగతిలో మొదటి ర్యాంకే వస్తుంది. తోటి స్నేహితులతో కలసి చదువుతూ వాళ్ళను కూడా తెలివైన వాళ్ళను చేయడం సిరి నిత్యకృత్యం.
ఒకసారి పాఠశాలలో పోటీ పరీక్షలు పెట్టి, ఆ పరీక్షలలో ఫస్ట్ వచ్చిన సిరికి ఉపాధ్యాయులు 1600 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఆ బహుమతిని భద్రంగా దాచుకుంటుంది సిరి. ఒకరోజు రాజు రహస్యంగా సిరి దాచుకున్న డబ్బులు దొంగతనం చేయబోయాడు. ఇది అప్పుడే అక్కడకు వస్తున్న సిరి స్నేహితురాలు శ్రుతి చూస్తుంది. రాజును హెచ్చరించింది. ఉలిక్కిపడ్డ రాజు ఆ డబ్బులను యథాస్థానంలో ఉంచాడు. ఈ విషయం చెల్లెలితో చెప్పవద్దు అని రాజు అన్నాడు. చెడు సహవాసాలు మాని ఇంటిపట్టునే ఉండి చదువుకోవాలని, మార్కులు పెంచుకోవాలని ఒక సంవత్సరం పాటు ఇలా తన మాట వింటే దొంగతనం విషయం చెప్పనని అంటుంది శ్రుతి.
రాజుకు చెల్లెలు అంటే పంచప్రాణాలు. ఈ దొంగతనం చేయబోయిన విషయం చెల్లెలికి తెలిస్తే చెల్లెలు ఎప్పటికీ తనతో మాట్లాడదు. అనుకున్నాడు రాజు. పాపం రాజు! ఇంటిపట్టునే ఉండి చదువుకోవడం మొదలుపెట్టాడు. అర్థం కానివి చెప్పించుకుంటు మార్కులు పెంచుకుంటున్నాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతున్నారు. సిరి నమ్మడం లేదు. సంవత్సరం గడిచింది. రాజు శ్రుతిని కలసి దొంగతనం చేయబోయిన విషయం ఎవరికీ చెప్పవద్దు అని వేడుకున్నాడు. శ్రుతి మరో రెండు షరతులు విధించింది. రాజు చెడు సహవాసాలు పూర్తిగా మానేయాలని, మరింత కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలని అప్పుడు దొంగతనం విషయం పూర్తిగా మరచిపోతానని అని షరతులు విధించింది. చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాడు రాజు. "చచ్చింది గొర్రె." అన్నది సిరి. అన్నయ్యను మంచిదారిలో పెడుతున్నందుకు శ్రుతికి కృతజ్ఞతలు చెప్పుకుంది సిరి. అన్నయ్య తన డబ్బులు దొంగతనం చేయబోయినపుడే శ్రుతి తనకు చెప్పిందన్న విషయం అన్నయ్యకు తెలియకపోవడం మేలు అయిందని అనుకుంది సిరి.
భలే అమ్మాయి : సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి