సుప్రభాత కవిత : - బృంద
పంట చేను గట్టున కూచుని 
పరమేశ్వరుని తత్వపు సారం
పరవశించి పాడుతున్న
పండు ముసలి అవ్వ బోసినవ్వంత
అందం.

పాదాల మువ్వల చిరు సవ్వడితో
పరుగులు తీస్తూ నవ్వులు దొర్లిస్తూ
హాయిగా వెన్నెల్లో ఆడుకునే 
ఆడపిల్ల మనసంత అందం....

తెలిసీ తెలియని ప్రేమ 
కలిసీ కలవని కళ్ళు 
కంగారుగా తప్పుకుని
దొంగగా చూసే చూపంత
అందం

ఊయల్లో బజ్జుని ఊగి
మెల్లగా నిద్రలోకి జారుకుని 
బుల్లి పిడికిళ్లతో సంతోషం
మోసుకొచ్చే బుజ్జి తండ్రి మోమంటి
అందం

తూరుపుతో సరసమాడి 
నింగి బుగ్గలు ఎరుపెక్కించి 
నులి వెచ్చగా చుంబిస్తూ 
గిరుల మాటున తొంగి చూచు
రవిబింబపు అందం

ప్రకృతిని ప్రచోదనం చేస్తూ
రక్షించు తండ్రిలా ఏతెంచి
నిరీక్షించు హృదయాలకు
నిలువెత్తు దర్శనమిచ్చే
కర్మ సాక్షికి

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు