విజయజయం: సరికొండ శ్రీనివాసరాజు

 విజయపురి సామ్రాజ్యాన్ని ధనంజయుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. రాజ్య విస్తరణపై దృష్టి పెట్టకుండా పూర్తి శ్రద్ధ పరిపాలన మీదనే ఉంచేవాడు. సైన్నాన్ని పెంచుతూ నిత్యం వారికి శిక్షణ ఇస్తున్నా అది రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవడానికే కానీ, రాజ్య విస్తరణ కోసం కాదు. 
     ధనంజయకు ఒక్కడే కొడుకు. అతడి పేరు రాజేంద్రుడు. అతనికి విద్య నేర్పించడంలోనూ యుద్ధ విద్యలలో ప్రవీణుని చేయడానికి రాజు ప్రయత్నిస్తున్నాడు. కానీ రాజేంద్రుని ఆలోచన మరోలా ఉంది. తాను రాజు గారికి ఒకే ఒక్క కొడుకును. తండ్రి తర్వాత రాజు కావలసింది తనే. దానికి మరో ప్రత్యామ్నాయం లేదు. మరి ఈ మాత్రం దానికి విద్యలు నేర్చుకోవడం అవసరమా? రాజు కొడుకును కాబట్టి సుఖంగా కాలం వెళ్ళబుచ్చుతా అంటూ తింటున్నాడు. వృథాగా తిరుగుతున్నాడు. కాలం గడుస్తున్నది. 
     ధనంజయ తనకు వృద్ధాప్యం సమీపిస్తున్నందున యువరాజును ప్రకటించాలని అనుకుంటాడు. దేశభక్తుడు, అన్ని విద్యలలో ఆరితేరిన వాడు, సత్ప్రవర్తనలో పేరు పొందనవాడు అయిన విజయునికు యువరాజ పట్టాభిషేకం చేయ నిశ్చయించాడు. ఇది అన్యాయమని ఎదురు తిరుగుతాడు రాజేంద్రుడు. విజయునికి వచ్చిన విద్యలలో కనీసం ఒక్క విద్యలోనైనా విజయుని ఓడించమని, అప్పుడు రాజేంద్రుని రాజుగా చేస్తానని అన్నాడు ధనంజయుడు. నీరుగారిపోయాడు రాజేంద్రుడు. తాను శాశ్వతంగా కనబడకుండా వెళ్ళిపోతానని బెదిరించాడు రాజేంద్రుడు. మంచిది, ఎక్కడికైనా వెళ్ళవచ్చని అన్నాడు ధనంజయ. తిండికి, తినడానికి మరిగినవాడు ఎక్కడికి వెళ్తాడు. చేసేది ఏమీ లేక ఇంట్లోనే ఉన్నాడు. "విజయా! ఈ రాజ్యాన్ని నీ చేతిలో పెడుతున్నా. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ధనంజయకన్నా మంచి రాజు విజయ అని పేరు తెచ్చుకో" అని విజయను రాజును చేసి, తాను విశ్రాంతి తీసుకుంటున్నాడు ధనంజయ.

కామెంట్‌లు