సామెత -46-అగ్గిదేవుడు చలికాలంల చంటి పోరడు -ఎండకాలంల ఎదిగినోడు
*****
"అవ్వా! గియ్యాల ఎంత పెద్ద గండం తప్పిందో తెల్సునా?అయిన గని గంత సోమర్తనమా! పొయినేడాది జర్గిన పెమాదం గప్పుడే యాది మర్సింది.పాపం గా గుడిసెలు గాలిపోయినోళ్ళు గిప్పటి దనుక కంటికి పుట్టెడు ఏడుత్తనే ఉండ్రు. జాగర్త జెప్పడం సుత పాపమై పోయింది.ఏందో అవ్వా !గీ మడుసులు. ఏమన్న అన్నమా! ఇంగ జూస్కో "కాలికి గజ్జెలు గట్టుకొని కయ్యానికి ఒత్తరు".
"అవునే శెల్లె! గియ్యాల నిజ్జంగ మనందరి అదృట్టం బాగుంది.బగమంతుడు మనందున్నడు.లేకుంటెనా కట్టుబట్టల్తో మిగిలేటోళ్ళం.
శెల్లే!నేనైతె గా ఇళ్ళకేలి ఎల్లినప్పుడల్లా " ఓ అక్కో! ఓశెల్లే! "మనం సంపన్న సావుకార్లం గాదె. పొలాలు పుట్రలున్న రైతన్నలం గాదె. అప్పు సప్పు లేకుండా ఉన్న పూరి గుడిసెల్నె సొర్గమొతికె సంబురపడ్కుంట బత్కేటోళ్ళం.గట్టాంటి గుడిసెల్ని ఎండకి వానకి నిప్పుకి,నీళ్ళకి జాగర్తగ సూసుకోవాలె అని 'సెవున ఇల్లు గట్కొని సెప్తుంట'. ఐతేంది సెవున బెడ్తెనా?.
పొయ్యి ముట్టించి పనైనంక చెంబెడు నీళ్ళు జల్లి అగ్గిని ఆర్పాలె.గంతేగని బూడిదెనే గదాని నిర్లచ్చం చేత్తె గాలికి నుప్పు రవ్వలు లేత్తయని జెప్పినా ఇనుకో లేదు.వొదిలేసి పన్కి బాయె.అగ్గి దేవుడు చలికాలంల సంటి పోరడి లెక్క నెమ్మదిగా పాకుతున్నట్టు ఉండబట్టి సరిపోయింది. గిదే ఎండకాలమైతె పక్క గుడిసె తాత సూసే తల్కి అగ్గి దేవున్కి గుడిసెలన్ని పలారమై పొయ్యేటివి.
గా తాత సైమానికి సుట్ట గాల్సుకుందమని సెకుముకి రాయి గొట్కోడానికి పందిట్ల కొచ్చిండంట.నెమ్మది నెమ్మదిగా రాజుకుంట ఎర్రగా మోదుగ పువ్వొతికేదో కదుల్తున్నట్టగుపించి అటేపు సూసిండట. సలికాలమై సరిపోయింది గని గదే ఎండకాలమైతెనా అగ్గి దేవుడి ఉగ్గర రూపాన్కి తాను సుత ఏమయ్యేటోన్నో అన్నడు.సర్ర సర్ర గాబుల నీళ్ళు ముంచకపొయ్యి సల్లార్చిండట.
గిదంత సెవులొగ్గి ఇంటున్న భూలచ్మి "అవ్వా! అగ్గి దేవుడిని మన బుడ్డోడి లెక్క "సలికాలంల సంటి పోరడు" అన్నవ్. అంటే ఏంది? మల్లోపాలి చెప్పవా?"
అవ్వ నవ్వుకుంట అవునే బంగారూ! అగ్గి దేవుడికి మనందర్కి బెట్టినట్టె సలి కాలం అగ్గికి సలి బెడ్తుంది. గప్పుడు కట్టెపుల్లలు,బొగ్గులు,కొరకాసులు బయట సల్లదనాన్కి గవ్వి సుత సల్లబడి మంట బాగ మండవు.గొట్టం బెట్టి ఎంత ఊదినా పొయ్యి సుత రాజుకోదు. గందుకే సలికాలంల అగ్గి పెమాదాలు తక్కువగ వుంటై.
గదే ఎండకాలంల ఎండకి కట్టెలు,పుల్లలు పెటపెటమని ఎండిపోయి వుంటయ్. అగ్గి గిట్ల అంటిత్తె గట్ల పేద్ద మంటై మండుతై. అంటే అగ్గి దేవుడు పెద్దోడి లెక్క ఉరికురికి గాలికి ఎగుర్కుంట గుడ్డలకి, గుడిసెలకి చెక్కముక్కల్కి అంట్కొని బూడిద జేసేత్తడన్న మాట.
గందుకేనా అవ్వా అగ్గి దేవుడ్ని "సలికాలంల సంటి పోరడు - ఎండకాలంల ఎదిగినోడు" అంటరు.
"అబ్బో! భూలచ్మి బంగార్కి యిసయం బలేగ తెల్సిపోయిందే" అంటుండంగనే ...
అవ్వోయ్! అవ్వా! మన తాత సుత గట్లనే.సంటిపోరడి లెక్కనే ఒక్కోపాలి ఏం దెలియనోడిల ఉంటడు.ఇంగ కోపమొత్తె ఎండకాలమొతికె మండిపడ్కుంట ఉంటడు".
అన్న బుడ్డోడి మాటల్కి బల్లెపీట మీన కూసున్న తాత నవ్వుకుంట"ఒరేయ్! మన్వడా! మద్దెల నా ఊసెందుకురా? "ఉర్మురిమి మంగలంమీద బడ్డట్టు" అంటుంటే అందరు ఒక్క నవ్వుడు గాదు పో.
గదండీ సంగతి! "అగ్గి దేవుడు చలికాలంల చంటి పోరడు - ఎండకాలంల ఎదిగినోడు" అంటే గిదే మరి. గిదేన్నే సందర్భం వొచ్చినప్పుడు మనుషులకు వర్తింపజేసి చెబ్తుంటరు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి