సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 49-అమ్మ సుట్టం గాదు అయ్య సుట్టం గాదు జంగమోన్ని పట్కొని జాము ఏడ్సినట్టు
****
శెవ్వా!గిదేం మడిషవ్వా?  గాయన్ని బట్కొని గా ఏడుపేంది? ఇచ్ఛింత్రం  పాడు గాను.ఒక్కొక్కలు ఒక్కో తీర్గ అనుకోబట్టిండ్రు.సూడబట్టిండ్రు. గజ్జూసి నా తల్కాయ కొట్టేశినంత పనైందనుకో?
 ఏందే? సాత్రి ఏం జర్గింది? ఓళ్ళ ముచ్చట నువ్ జెప్పేది? గింతకు మున్పే జానయ్య మావని జూడ ఎళ్ళొచ్చిన. మడిషి ఆయెపాయె అన్నట్టుండు.దవాఖానకి తోల్కబోతే వొయసు మీరింది. రకత పోటుతో తల్కాయ నరాలు శిట్లినయ్. బత్కడం కట్టమే, ఇంటికి దీస్కబోండ్రి అన్నడంట డాకటరు.గందుకే ఎల్లి జూసొచ్చిన..
నేను సుత బొయ్యొచ్చిన.గా ముచ్చటే జెప్పనీకి వచ్చినవ్వా! గా తాతని జూడనీకి ఆళ్ళు ఈళ్ళు ఇరాం లేకుండా వత్తున్నరు. ఎవ్వలొచ్చినా తాతకి గిట్లయింది. గట్లయిందన్న మడిసి గాయనెవడో రాంగనే ఎదురు బొయ్యి కుర్సీల కూసుండ బెట్టి గాయన శేతుల్ల మొగం బెట్టి ఒక్క ఏడ్పు గాదుపో.
గదంత జూసిన నాకే ఎట్లెట్లనో అయ్యింది. గీ పొల్లేంది గాడ్ని బట్టుకొని ఏడుత్తుంది. ఎవలన్న సూత్తె ఏమన్న అన్కుంటరన్న సోవిలేదు పొల్లకి. దాని మొగుడింక రాలే. గాడు సూత్తె ఇంగేమన్నుందా? నుప్పు లేకుండనే అగ్గి రగుల్కోదూ! గంత మందిలెల్లి  పొల్లకి చెబ్దామంటే గాళ్ళందరి దృట్టి పొల్ల మీదెక్కడ బడ్తుందోనని ఎన్కడుగేశిన. నువ్వేమన్నను అవ్వా! గా పొల్ల వాల్కం అస్సలు నచ్చలె.
అయితే  సాత్రీ! గా వచ్చినాయ్న  అమ్మయిపు, నాయినొయిపు సుట్టం గాదన్న మాట.
"అవునవ్వా!గా జానయ్య తాతతో సుట్టిరికం గీనాటిది గాదుగ.నాకు దెల్వని గా కొత్త సుట్టమెవ్వలో అస్సల్కి అంతు దెల్వట్లే.
అయితే గా పొల్ల  ఏడ్పు"అమ్మ సుట్టం గాదు అయ్య సుట్టం గాదు జంగమోన్ని పట్కొని జామేడ్సె అన్నట్టుందన్న" మాట.
 "నిజ్జంగవ్వ! సత్తెం జెప్పినవ్!
అయితె గాడెవడో  సూడాలనుందె సాత్రీ! మల్లోపాలి పొయ్యొద్దం.పొద్దుగాల బొయినగని ఇంట్లెపనుందని జరసేపు సుత ఆక్కుండొచ్చిన.
***
అగ్గో! అవ్వా! గాయ్నె! గాయ్ని బట్కొనె పొల్ల ఒక్క ఏడ్పు గాదు పో!
ఓష్నీ! సాత్రీ! నీ తెల్వి తెల్లారినట్టె వుంది. గా పోరడు దాని ఆడబిడ్డ మొగుడె. గాడు రాక రాక గీ ఊర్కి వొచ్చిండుగా. దాన్కి తాతకున్న బంధాన్ని జెప్పుకుంట గట్లేడిశినట్టుంది. అగ్గో పక్కనే దాని మొగుడు సుత ఉండు."
అంటుంటే... అవునావ్వా! నేను సుత అన్కున్న గని... ఏమో... నసుక్కుంట ఆగిపొయ్యింది.
గిదండీ!సంగతి! గిట్ల తెలియని విషయాలు కొత్తోళ్ళకి జెప్పుకొని బాధ పడ్తె చూసేటోళ్ళు గట్ల "అమ్మ సుట్టం గాదు అయ్య సుట్టం గాదు- జంగమోన్ని పట్కొని జామేడ్సె అన్నట్టుంది" అన్కోవడం అంటే గిదే మరి. సమజైందన్కుంట గదుండీ!

కామెంట్‌లు