పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీల్లో తిరుమలరావు పాల్గొని విజేతగా నిలిచారు. ఆ అపూర్వ బాల్యం అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో వందలాదిమంది పాల్గొనగా, అందులో తిరుమలరావు పంపిన అన్నెం పున్నెం ఎరుగని బాల్యం అనే కవిత విజేత స్థానాన్ని సొంతం చేసుకుంది. శ్రీశ్రీ కళావేదిక 36 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సాహిత్య సంస్థ గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్నారు. తిరుమలరావు పంపిన రచనలో అగ్గిపెట్టెల మధ్య దారాన్ని ఉంచి ఆడే మాటలే ఫోన్ కాల్ అంటూ, ఎండను అద్దం ద్వారా ఇరుకు గదుల్లో పంపి ఫిలిం మధ్యన ఉంచి గోడపై సినీమా బొమ్మను చూపే గర్వం ఆ అమూల్య బాల్యం అని రచించారు. గట్టుపైనుంచి చెరువులో గెంతుట కుండ పెంకులను చెరువు ఉపరితలంపై నేర్పుగా విసురుటనే బాల్యం ముచ్చట్లు కంటచెమ్మ గుండెతడి అని రచించారు. ముళ్ళ కొమ్మలకు భయపడక కటికరేంపళ్ళను తెంపే తెగువ ఆ అపూర్వ బాల్యం అని చాటి చెప్పారు.
ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జి.ఈశ్వరీ భూషణం, నూక సంపత్ కుమార్, నల్లా భాగ్యలక్ష్మి, మళేకర్ నాగజ్యోతి, సాహూ సంధ్య, తాటి హరీష్, సువర్ణ జోషి, ఎస్.మహాలక్ష్మిరెడ్డి, పి.సాయిసంతోషిలు సమన్వయకర్తలుగా, నిర్వాహకులుగా, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, అన్నెం పున్నెం ఎరుగని బాల్యం అను కవితను అభినందిస్తూ తిరుమలరావుకు విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు.
తిరుమలరావు ఆనాటి తీపి గురుతుల సువాసనను నింపి, అపూర్వ క్షణాలను అక్షరాల రూపంలో మలచి కాలం తుడిచేయలేని బాల్యపు పరిమళాలను తన కవిత ద్వారా చాటిచెప్పారని, ఆయన భాషా మాధుర్యాన్ని అభినందిస్తూ టాప్ టెన్ లో నిల్పి, విజేత ప్రశంసాపత్రాన్ని వారు పంపారు.
జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత ఐన కుదమ తిరుమలరావు గానం, చిత్రలేఖనం, నటన, రచన, సేవారంగాలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ, నేడు జాతీయ స్థాయి కవితల్లో విజేతగా నిలుచుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి