సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 సామెత -55: -అంతనాడు లేదు,ఇంతనాడు లేదు,సంతనాడు కట్టింది ముంతంత కొప్పు.
****
"ఓ అవ్వో! జూసినావె గీ ఇచ్ఛింత్రం!బొడ్రాయి  ఎడంపక్కిల్లు  శింగమ్మొదిన్ని! గీ మద్దెన గా వొదిన తీరే మార్పోయింది. సూత్తుంటే నవ్వాల్నో ఏడవాల్నో తెల్వట్లే!
ఎవరే శెల్లే! గా శింగమ్మనా? గా నూలు శీరె, వేలు ముడి,మొకాన పావలా కాసంత బొట్టు పెట్కొని, శింగులు బొడ్లె దోపి ఎప్పుడు జూశినా ఏదో ఒక పన్జేసుకుంటనే ఉంటది. గా వొదినె ముచ్చటేనా? ఏం జర్గిందే శెల్లె? గంత ఇచ్ఛింత్రం పనేం జేసిందే?
 "గదేనే అవ్వా! మడుసులు గిట్ల సుత మార్తరా?లగ్గమైన దెగ్గర్నించి సూత్తున్న?ఎప్పుడు జూసినా ఒక్క తీర్గ ఉంటదని మన్మంత అనుకునేటోళ్ళం గద. గస్మంటిది గిట్ల మారడం ఆచ్చెరంగుందే అవ్వా?
 "గింతకేమైందో ? గా సంగతేందో చెప్పరాదె? శిన్న పొల్లగాండ్లొతికె మల్ల మల్ల శెప్పి ఊరిత్తున్నవ్!
ఇంగో అవ్వా! మొన్న నేను, మీ మర్ది,పిల్లగాండ్లు కల్సి గొల్లగట్టు జాతరకి బండి గట్కొని బొయినం‌ సూడు.గక్కడికి శింగమ్మొదినె, రానెక్కని జూసి వొదిన్ని పోల్సుకున్న. ఇంగ వొదినె సింగారం జూసి మూర్చెబొయినంత పనైందన్కో.కనకాంబ్రాల రంగు చీరె గట్టి రైక తొడిగింది.పెదిమెలకు లిపుటిక్కు రుద్దింది.ఇంగ ఎప్పుడూ పెట్టే ఏలు ముడి దీసి కొబ్బరికాయంత కొప్పు పెట్టింది.కొప్పు సుట్టూర చీరె రంగస్మంటి కనకాంబ్రాల చెండు సుట్టింది.అసలే తెల్ల తోలాయె. గా వొదినె సక్కదనాన్ని సూడ రెండు కళ్ళు జాల్లేదన్కో.
అవునా శెల్లె! "అంతనాడు లేదు, ఇంతనాడు లేదు- సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు" అంటే గిదేనేమోనే!ఎస్మంటి మడిషి ఎట్ల మారింది. నువ్వు జెప్తుంటే నేను సుత సూడనైతిని అనిపిత్తున్నది".
"అవునవ్వా! పండక్కో, పబోజనాలకు గట్ల సింగారిచ్చుకుంటే ఎవ్వలేమనుకోరు గని జాతర్కో,సంతకో ఎల్లినప్పుడు గిట్ల తయారైతే మాత్తరం  నా అస్మంటి తెల్సినోళ్ళు జూత్తె  ముక్కునేలు ఏస్కుంటరు."
"ఏమోలేవే శెల్లె! అన్న ఇంట్లె గిట్ల మంచిగ ఉండనీకి పడనియ్యలేదో? ఏమో? ఎన్నాళ్ళనించి  కాయుషు పడ్తుందో! ఏమో!గందుకే  రానెక్కెంట గిట్ల తయారై వొచ్చినట్టుంది.నువ్వు సుత సూన్నట్టే ఉండు.అన్నకి తెలిత్తె లేనిపోని లొల్లయిద్ది. గాడసలే తాగినప్పుడు ఒక తీర్గ, తాగనప్పుడు ఇంకో తీర్గుంటడు."
అన్న అవ్వ మాటల్కి "నిజమే అవ్వా! గందుకే ఓ అంత దూరం నించి జూస్నగని దెగ్గర్కి బోలె! కని సైన్మాలో వానిశ్రీ లెక్క ఎంత సక్కంగుందన్కున్నవ్.శింగమ్మొదినె అన్కోంగనే మొన్న జాతర్ల రూపమే అగుపిత్తున్నది." అన్కుంట బోయింది  వినోద.

కామెంట్‌లు