పరులను వేధించి హింసించి
భయపెట్టి బాధపెట్టి మభ్యపెట్టి
మోసం చేసి దగాచేసి దౌర్జన్యం చేసి
అన్యాయంగా అక్రమంగా ఆర్జించిన
ఆస్తులను డబ్బులకట్టల్ని బస్తాల్లో
ఇంట్లో ఇనుప బీరువాల్లో
మంచాల కింద పట్టుపరుపుల కింద
బ్యాంకు లాకర్లలో బినామీ పేర్లతో
స్విస్ బ్యాంకుల్లో దాచి...
నిన్న ప్రపంచంలోనే
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడిగా
అత్యంత ధనవంతుడిగా విర్రవీగి...
ఖండాంతర ఖ్యాతినార్జించి...
తాను అనుభవించక...
పరులకింత పంచక...
నేడు దరిద్రుడిగా...
వీధిలో బిక్షగాడిలా...అయ్యో
కన్నుమూసి ఖాళీచేతులతో
కాటికెళ్ళిన"ఆశబోతు మనిషిని" చూసి...
"నిజానికి ఈ నరుడు తిక్కశంకరుడే"...
అంటూ మదనపడి పోయిందట...మంచం
విలాసవంతమైన
విశాలమైన సువిశాలమైన
విల్లాల్లో పాలరాతి మందిరాలలో
పట్టుపరుపులపై శయనిస్తూ
ఖరీదైన కార్లలో తిరుగుతూ
విదేశాల్లో విమానాల్లో
విహారయాత్రలు చేస్తూ సుఖంగా
హాయిగా ఆనందంగా జీవిస్తున్నా...
ఎదురుగా అతిరుచికరమైన
కంటికింపైన నోరూరించే
ఆహార పదార్థాలెన్నో
అందుబాటులో ఉన్నా
అన్నీ తినాలని ఉన్నా
ఏదీ తినలేని దుస్థితిలో ఉన్న
"ఆశబోతు మనిషిని" చూసి...
"నిజానికి ఈ నరుడు తిక్కశంకరుడేనని"...
“సుఖం అంతా సుందర స్వప్నమేనని"...
"కన్నీటి సందేశమిచ్చిందట"...కంచం.
"నాది నాది
"అనుకున్నదేదీ
"నీది కాదురా...
అన్న ప్రభోదగీతం
ఎన్నిసార్లు విన్నా
ఆరడుగుల జాగాను మరచి...
వేలఎకరాల భూమిని
అక్రమంగా ఆక్రమించిన
"ఆశబోతు మనిషిని" చూసి...
"నిజానికి ఈ నరుడు తిక్కశంకరుడే"...
అంటూ పక్కున నవ్విందట...భూప్రపంచం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి