సామెత-54:-అడవి పంది శేను మేస్తే ఊర పంది శెవులు గోసినట్టు
***
"అవ్వా! అవ్వా!గీ సంగతి ఇన్నావ్!దొర్సాని పచ్చలారం బోయిందంట.గాళ్ళింట్లె పన్జేసే సుక్కవ్వే గీ పన్జేసిందని,యాడ దాశినవో తెచ్చియ్యమన్రంట. లేకుంటే పోలీసులకి బట్టిస్తనని బెదిరిచ్చిండ్రట.
అయ్యయ్యో!అవునానె సుకన్నే!గా సుక్కవ్వ గస్మంటిది గాదు గదనే. గాళ్ళింట్ల గీనాడా గానాడా!పాతికేల్ల సంది పన్జేత్తుంది.ఎన్నడైన పల్లెత్తు మాట బల్లె. ఇంట్లె మనిషొతికనే తిరుగుద్ది.పనులు చేసుద్ది.ఏనాడు కొంపకొచ్చి కొన్ని గంటలన్న నడుం వాల్సింది గాదు.ఇంట్లె గూసుంటె ఇల్లెట్లెల్తదవ్వా?అనేది. గిందులో ఏదో మతలబుందే సుకన్నే"
అవునవ్వా!పనొద్దంటే పైసలు లెక్క గట్టి పొమ్మని జెప్పాలె గని.గిట్ల నిందమోపుడేమన్న బావుంద.నెత్తినోరు గొట్కొని బగ్గ ఏడుత్తుంటె సూసి మన్సు కలికలి అయింది."ఏం గాదు తీ నిప్పసుమంటి దానివి. పాపం పున్నెం బగమంతునికి తెలుత్తనే ఉంటది."అని ఓదార్సొచ్చిన. నువ్వు సుత జెప్తె మరింత దైర్నముంటదవ్వా!"
నేనే ఎల్దమన్కుంటున్న.ఇంతట్లె నువ్వొచ్చినవ్ పా ఎల్దం.
***
"అస్లే దొర్సాని మొగుడు సన్నసిన్నోడు గాదు.గాయ్నంటె ఊళ్లె అడల్.సుక్కవ్వోల్ల పరిత్తితి ఏమైతదో " అని ఊరు ఊరంత సెవులు గొరుక్కుంటుండ్రు."మంచంల గూసున్న రాజయ్య కండ్ల నీళ్ళు బెట్కుంటుంటే ఎల్లిన ఇద్దరి మన్సు విలవిల్లాడింది.
"ఇంగ సుక్కమ్మ మొగం పీక్కపొయ్యి ఏమడ్గిన ఉలికులికి పడ్కుంట "నేం దియ్యలే అవ్వా! నేనెందుకు దీత్త! గిట్ల నా మీద దొంగతనం మోపిండ్రు.గిది లాయికేనా? నేనెస్మంటి దాన్నో గాల్లకెర్కలేదా? గట్ల మీద నేరం మోప్తరా? గిదేందవ్వా అగ్గి పరీచ్చ. పోలీసులు ఒత్తరంట" అంటున్న సుక్కవ్వని జూత్తుంటె ఎల్లినిద్దరికి సుత దుఃఖమాగలె."
"ముందుగాల ఏం జర్గిందో జెప్పు సుక్కవ్వా? పోలీసులు గాదు గాళ్ళ తాతలొచ్చిన ఏం గాదు.నేనున్న నీ పక్కన". "అడవిపంది శేను మేత్తె ఊరపంది శెవులు గోశినట్టుంది యవ్వారం" అన్న అవ్వ మాటల్కి...
అవునవ్వా! గట్లనే ఉంది.కండ్లు,ముక్కు పైటతో దుడుసుకుంట అవ్వా! దొర్సానీ, దొర్సాని బిడ్డ, మన్వడితో గల్సి మొన్న రేతిరి పట్నంల పంచనుందని ఎల్లుకుంట "సుక్కవ్వా ! గీ పచ్చలారం ఎట్లుందని అడిగిండ్రు.మస్తుందన్న. గిది పదిలచ్చలు బెట్టి చేయించిన.పెట్కోమంటే ససేం వద్దంది.గిప్పుడు జూడు ఎంతందంగుందో. నువ్వు సుత అన్నవ్" అన్కుంట బోయిండ్రు."
"నిన్న పొద్దుగాల పన్లన్ని జేత్తుంటే బీర్వా తల్పు తీసుంది జూసిన. పొయ్యి దొర్సానికి జెప్తే. "యాది మర్సిన మా బాగ జెప్పినవ్ సుక్కవ్వా!" అంది.ఇయ్యాల ఇంట్లె పనుందని జెప్పి మద్దేనం వచ్చినవ్వా! గిట్ల ఒచ్చిన్నో లేదో గట్ల దొర్సాన్నుంచి పిల్పొచ్చింది. గదేంది గిప్పుడే వొచ్చిన గద అన్కుంట ఎల్లిన. ఇంగ దొర్సాని బిడ్డ ఇంత నోరేస్కుని "పచ్చలారం జూసినవా?ఏడ దాశినవ్ జెప్పు" అని నిలదీయబట్టింది. రాత్రి జూసింది నువ్వే. మస్తుందన్నది నువ్వే. నువ్వు గాకపోతె ఎవలు దీత్తరంటది.పోలీసులను బిల్చి నిజం కక్కిత్తదంట" "తీయనే తీయనైతిని. నాతోటి ఎట్ల గక్కిత్తది జెప్పవ్వా!" అన్కుంట వలవలా ఏడ్వబట్టింది.
అవ్వని ఎతుక్కుంట వొచ్చిన భూలచ్మి "అవ్వా! అవ్వా! నీకో ముచ్చటి జెప్పాలె జెల్ది రాయె!" గుసగుసగ చెవి కాడ మూతి బెట్టి అంది.
"సుక్కవ్వా! నువ్వేం రంది పడకు."ఇంటి దొంగని ఈశ్వరుడు సుత పట్లేరని" అంటర్గని మనం పడ్తం పికరు జెయ్యకు" అన్కుంట...
"భూలచ్మిని ఎంట బెట్కొని వత్తుంటె దారి పొంటి బల్లె ముచ్చట్లె చెప్పబట్టింది గా ముచ్చెట్లె గొలుసు ముచ్చటొచ్చే తల్కి అవ్వ ఉల్కిపడి, "ఎవులన్న గీ మాట ఇన్నరా ఏంది? అటీటు దిక్కులు జూస్కుంట ఇంటికి గబ్బ గబ్బ దీస్కొచ్చింది.
బల్లెపీట మీద కూస బెట్టి గా గొలుసు ముచ్చటేందో తొరగ జెప్పమని భూలచ్మిని తొందర బెట్టింది.
"ఎప్పుడూ ఆనెక్క ఇంట తీ ముచ్చట్లు" అనే అవ్వ ఎందుకిట్ట జేత్తుందో, పరేషాన్ అవుతుందో తెల్వట్లే భూలచ్మికి.
"అవ్వా! "ఇయ్యాల ఆరో తర్తికి దొర మన్వడొచ్చిండు తెల్సా!దొర తాన పన్జేసే పాలేరు కొడ్కుండు తెల్సుగా.గా ఈరేషన్నతో కల్సి వొచ్చిండు.ఇంట్లె శికాకు జేత్తుండని దొర్సాని గా అన్నెంట పంపిందంట.*
"గందుల ఏముందే ఇచ్ఛింత్రం.ఎప్పుడొచ్చిన గానితోని బల్లెకొత్తడు గద! ఆనెక్క ఏమైందో జెర గబ్బగబ్బ జెప్పే తల్లీ!"
అంటున్న అవ్వొంక ఆచ్చెరంగా సూస్కుంట "గాదొర మన్వడు దగదగ మెర్శే ఓ గొల్సు దెచ్చిండు. గది పచ్చరాల్లతో మెర్శి పోతుంటే ఆ తర్తిల అక్కలైతె నేం బెట్కొని సూత్త, నేను బెట్కొని సూత్త అన్కుంట బెట్కొని ఒక్క తీర్గ ముర్సుడు గాదు. నేను సుత గా తర్తి అయితె పెట్కొని సూద్దును అన్పించిందవ్వా! అంటుండంగనే...
అడావిడి పడ్కుంట గప్పుడే వొచ్చిన కొడ్కును బిల్సి " "ఒరేయ్ అయ్యా! ఒక్క సాయం జెయ్యాలె.ఉన్న పలాన గా ఈరేషును,దొర మన్వడిని మనింటికి బండెక్కించుకుని రా పో! అంది.
గాళ్ళిద్దరు రాంగనే బల్లెపీట మీద, భూలచ్మి, బుడ్డోడి పక్కన కూస బెట్టి నల్గురికి శిర్దిండి బెట్టింది. కొడుకును సాటుకు బిల్సి యిసయం జెప్పింది.
దొర మన్వడిని భూలచ్మి గొల్సు గురించి అడుగుడు. గా పిలగాడు జేబులున్న గొలుసు దీసి సూపెట్టుడు.గట్ల బల్లె జర్గిన ముచ్చట్లను మల్ల మల్ల అడుక్కుంట గవన్నీ ఆళ్ళకి దెల్వకుండ ఈడియో దీపిచ్చింది.జాగర్తగ ఎవలింటికి ఆళ్ళని పంపిచ్చింది.
"తెల్లారి పోలీసులిద్దరు వొచ్చిండ్రు.దొరోల్ల గడీలనే పంచాతి బెట్టిండ్రు.సుక్కవ్వ ఎంట అవ్వొక్కతే ఎల్లింది. సుక్కవ్వ మీదనే అనుమానముందని దొర్సాని, కాదని సుక్కవ్వ.గిట్ల వాదన జర్గుతుంటే...
మన్వన్ని బిలిపియ్యమంది అవ్వ.గాడు నోట్లె బెల్లం గడ్డ బెట్కున్నోడిల ఒకటి లేదు రొండు లేదు తల్కాయ నేలకేసిండు. గది జూసిన పోలీసులకి యిషయం అర్తమైంది.
అవ్వ గాన్ని జూస్కుంట "తప్పొకలిదైతే మరొకల్కి శిచ్చెయ్యడం నాయం గాదని 'అడవి పంది, ఊరపంది సామెత' జెప్పింది
"గిట్లయితదని ముందే ఊహిచ్చిన అన్కుంట కొడ్కు సెల్లుల దీసిన ఈడియో పోలీస్లకి సూపెట్టింది. గజ్జూసి దొర,దొర్సాని, బిడ్డ మన్వడితో సుత తెల్లబోయిండ్రు.గాళ్ళ మొకాల్ల కత్తివాటుకు నెత్తురు సుక్క లేదు. ఊల్లె అవ్వ తెల్వి కల్లది అంటరు గని గింత తెల్వుందని అన్కోలె ఆళ్ళు. నివ్వెర బోయిండ్రు. పోలీస్లను పిల్పించిర్రు గద.గాళ్ళ ముందు తమ పెద్దిర్కం,పర్వు బోద్దని యిసయం దెల్సి సుత ఉట్టి పున్నేనికి సుక్కవ్వనిరికిచ్చి గుడ్డ గాల్సి మీదెయ్యాలని జూసిండ్రు.
అయితే అవ్వొచ్చే తల్కి గాళ్ళ పిలాను తార్మారయ్యింది. ఇంగ గీ సంగతి మూడో కంటికి తెల్వొద్దని,పరువు బోద్దని అవ్వ శేతులు బట్కొని బతిలాడిండ్రు.
" సావు మరణమసుమంటి గండంల నుంచి అవ్వ తనని బయట బడేసిందని, సుక్కవ్వైతె ఒక్క తీర్గ శనార్తులు జెప్పుడు గాదు పో.
గదండీ సంగతి!గందుకే అంటరు "అడవి పంది శేను మేస్తే ఊర పంది శెవులు కోసినట్టు".ఎంత పర్వుకోసరమైతె మాత్తరం గట్ల జేయడం తప్పు గద.పోలీస్ల ముందు శిన్నతనం కావొద్దని గాళ్ళు సుక్కవ్వ మీదనే నెట్టాలని జూసిండ్రు.మరి అబిమానం గల్ల మడిసి, తొందర పడి ఏమన్న జేస్కుంటె ఎవలు బాద్దులు?మీరే జెప్పుండ్రి. "లోకం తీరు గిట్లుంటదని చెప్పడాన్కే గీ సామెత ఆడుతుంటరు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి