దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి… అంటూ
"అంతులేని కథ" చిత్రంలో
వినిపించారు ఓ విషాద గీతం
సినీ కవి ఆచార్య ఆత్రేయ...నిజమే
నిప్పులపై నడకే నిరుద్యోగి జీవితం...
వీధిలో ఉంటారు
అడుక్కునే బిక్షగాళ్ళు...
వెలుతురుకై వెతికే వెర్రివాళ్ళు
ఆకలిరాక్షసిని కాల్చాలతని
కలలుగనే ఆశాజీవులు...
వీధుల్లో తిరుగుతాయి
మొరుగుతాయి
గ్రామ సింహాలు
మహరాజులదిరోహించిన
గజరాజులను గాంచి...
వీధిల్లో తిరుగుతారు
వినోదం పంచే విదూషకులు
కడుపుబ్బ నలుగురిని నవ్విస్తూ...
కాలేకడుపుల్ని కన్నీట దాచుకుంటూ...
కొందరు వీధినాటకాలు వేస్తారు
జీవితమే వేదికగా విషాదమే వినోదంగా...
వీధిలో విసిరేస్తారు
ఎంగిలి విస్తరాకులు
కుక్కలతో కుస్తీ పడతారు
కొందరు ఆకలి తీరని అనాధలు...
వీధుల్లో ఉంటారు
విధిని ఎదిరించలేని
విధివ్రాతను చెరపలేని
అమ్మా నాన్నలను
కళ్ళారా చూడలేని
విధివంచితులైన
వీధి బాలలు...
కాలే ఇటుకల బట్టీల్లో
బంగారు బాల్యాన్ని
బలి చేసుకుంటూ...
అందుకే ఓ మనిషీ...
వీధుల్లో దీపాలెన్నో వెలిగినట్టు
కార్తీక దీపమై కాంతిని వెదజల్లు
ఆ వెలుగును పదిమందికి పంచు
నీ కోసంకాక పరుల కోసం జీవించు
నీకు జన్మనిచ్చిన మీ అమ్మ హర్షించు
నీకు ప్రాణంపోసిన ఆ బ్రహ్మ ఆశీర్వదించు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి