సుప్రభాత కవిత : - బృంద
కనులకింపైన దృశ్యం 
మనసు నింపే ఉల్లాసం 
అంతులేని అందమైన ప్రకృతిలో 
పదే పదే తప్పిపోవాలనుంది!

పాలమబ్బుల పల్లకి పై 
నింగిదారుల విహరించి
వంగి చూచి భువిని
పొంగి పోవాలనుంది!

మేఘాలు తాకే గిరుల 
అలవాటైన అల్లరికి
కనుమల జారే ఝరుల 
నేపథ్య సంగీతం వినాలనుంది!

పచ్చని చీర పొందికగా కట్టి 
వెచ్చని కిరణాలు పడి మెరుస్తూ 
ముచ్చటగా వధువులా  తోచే
లోయల బాట నడవాలనుంది!

నేలపై స్వేచ్ఛగా విరిసి
నవ్వులు రువ్వుతూ మురిసె
చిన్ని పువ్వుల సొయగాలు
కన్నుల నింపుకోవాలనుంది!

తెలియని తాయిలం తెచ్చే 
విలువైన వేకువ వెలుగులు 
కలలన్నీ తీరేలా వరమేదో 
తెస్తోందని ఉత్సాహంగా వుంది!

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు