సాహిత్య సుగంధాలతో పరిమళించిన కవిసమ్మేళనం

 ఘనంగా జాతీయ కవిసమ్మేళనం
తెలుగు కవుల సాహిత్య సవ్వడి
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాలలోని శ్రీశైల హైస్కూల్ సెమినార్ హాల్ లో జాతీయ కవిసమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది.  ఉషోదయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి, మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి రత్నం నేతృత్వంలో కవిసమ్మేళనాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా  సూరన సారస్వత సంఘం అధ్యక్షులు డా.గెలివి సహదేవుడు, రచయిత డా.  కిషోర్ కుమార్ , బేతంచర్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియాదాసు, ప్రముఖకవి నీలకంఠమాచారి, అన్నెం శ్రీనివాసరెడ్డి, మురళీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.గెలివి సహదేవుడు మాట్లాడుతూ కవిత్వమనేది కవి గుండెల్లో నుంచి ఉప్పొంగి అక్షరరూపం దాల్చి సమాజానికి ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నారు. డా. మరియదాసు మాట్లాడుతూ  కవిత్వం ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకురావచ్చని కవులను సాహిత్యాన్ని కవిత్వాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. డా.ధనాసి ఉషారాణి మాట్లాడుతూ "పసిడి నవ్వులు వెన్నెల దివ్వెలు"  అనే అంశంపై అనేకమంది కవులు వివిధ జిల్లాల నుంచి పాల్గొని తమ తమ కవితలను చదివి వినిపించడం జరిగిందన్నారు. కవితా సమ్మేళనంలో ప్రముఖ కవులు తమ సాహిత్య సృజనలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంస్థ నిర్వాహకులు కవుల సాహిత్య సేవకు గుర్తింపుగా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కవిసమ్మేళనంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది కవులు పాల్గొన్నారు. . 

కామెంట్‌లు