టిప్పరేం చేసింది..?:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
టిప్పరేం చేసింది..?
మృత్యురూపం దాల్చి
ప్రళయ మేఘంలా గర్జించి,
ఇనుప రాక్షసిలా దూసుకొచ్చి
21 మంది బస్ ప్రయాణికుల
"ప్రాణదీపాల్ని" ఆర్పేసింది...

టిప్పరేం చేసింది..?
రోడ్డు గుంటని తప్పించబోయి
"రంపంలా" బస్ కుడివైపును చీల్చింది
కూర్చున్న సీట్లే "శవపేటికలయ్యాయి"...

టిప్పరేం చేసింది..?
కొండలా బస్సుపై ఒరిగిపోయి
60 టన్నుల కంకర వర్షమై కురిసి
ఇరవై ఒక్క కుటుంబాలను
"సజీవ సమాధి" చేసింది...

టిప్పరేం చేసింది..?
కొన్ని జీవితాల్లో కంకరరాళ్ల
"ఆటంబాంబుల్ని" పేల్చింది...
అక్షరదీపికలైన
ముగ్గురు అక్కాచెల్లెల
బంగారు భవిష్యత్తు
క్షణంలో బూడిదైపోయింది
తల్లిదండ్రుల గుండెల్లో
"వేయి పిడుగులు" పడ్డాయి...

టిప్పరేం చేసింది..?
జీవితాంతం "మానని గాయాల్ని"
గుర్తుకు వేస్తే గుండెల్ని పిండేసే
"చేదు జ్ఞాపకాల్ని" మిగిల్చింది...

టిప్పరేం చేసింది..?
"జనన మరణాలు దైవాదీనాలనే"...
"నరుల జీవితాలు నీటి బుడగలనే"...
నిజాలను నిగ్గు తేల్చింది...
ప్రభుత్వాల "నిర్లక్ష్యాన్ని నిద్ర" లేపింది...
వాహనదారులకు"గుణపాఠం" నేర్పింది.



కామెంట్‌లు